Khammam: భర్త కష్టం చూసి చలించిన భార్య.. చిల్లర నాణేలతో రూ.50 వేలు పొదుపు చేసి..

భర్త పడుతున్న కష్టాలను చూసి చలించిన ఓ ఇల్లాలు.. టీ స్టాల్‌లో రోజూ వచ్చిన చిల్లర నాణేలను ఏడాదిన్నర పాటు పొదుపు చేసి ఏకంగా రూ.50 వేలు కూడబెట్టింది. ఆ డబ్బుతో భర్తకు టీవీఎస్ మోపెడ్‌ను బహుమతిగా అందించింది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన ఈ ఘటన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు, పొదుపు గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Khammam: భర్త కష్టం చూసి చలించిన భార్య.. చిల్లర నాణేలతో రూ.50 వేలు పొదుపు చేసి..
Human Interest Story Copy

Edited By:

Updated on: Oct 24, 2026 | 3:01 PM

 

భర్త పడుతున్న కష్టాన్ని చూసి చలించిన ఓ ఇల్లాలు.. ఆయన ఇబ్బందులను తొలగించేందుకు తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది. రోజూ టీ స్టాల్‌లో వచ్చిన చిల్లర నాణేలను ఒక్కొక్కటిగా దాచిపెట్టింది. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.50 వేల వరకు పొదుపు చేసింది. చివరకు ఆ డబ్బుతో తన భర్తకు ఓ టీవీఎస్ మోపెడ్‌ను బహుమతిగా అందించింది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన ఈ ఘటన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు, పొదుపు గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామానికి చెందిన తడికమల్ల విజయరాజు, విజయ దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వైరా మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మహిళా సమాఖ్య ద్వారా రూ.2 లక్షల రుణం తీసుకున్న విజయ.. టీ స్టాల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే, సొంతంగా ద్విచక్ర వాహనం లేకపోవడంతో ఈ దంపతులు నిత్యం ఇబ్బందులు పడేవారు. వైరా నుంచి తమ స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చేది. మరోవైపు, విజయరాజు టీ స్టాల్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ వ్యాపార సంస్థలకు నడుచుకుంటూ వెళ్లి టీ సరఫరా చేసేవారు. భర్త పడుతున్న కష్టాలను చూసిన విజయ.. ఆయనకు ఓ వాహనం కొనివ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా టీ స్టాల్‌లో రోజూ వచ్చిన చిల్లర నాణేలను ఓ డబ్బాలో దాచడం ప్రారంభించారు. ఇలా సుమారు ఏడాదిన్నర పాటు ఒక్కో రూపాయి పొదుపు చేస్తూ.. ఏకంగా రూ.50 వేల వరకు కూడబెట్టారు. ఆ డబ్బుతో భర్తకు టీవీఎస్ మోపెడ్ కొనివ్వాలని భావించారు.

ఇదే సమయంలో దసరా పండుగ సందర్భంగా వైరాలోని వజ్ర టీవీఎస్ షోరూంలో ద్విచక్ర వాహనాలపై రూ.10 వేల వరకు రాయితీ ప్రకటించారు. దీంతో విజయ తన భర్త విజయరాజుతో కలిసి షోరూంకు వెళ్లారు. తాము ఏడాదిన్నరగా దాచుకున్న చిల్లర నాణేల డబ్బాను తెరిచి, ఆ నాణేలతో తమకు వాహనం ఇవ్వాలని షోరూం నిర్వాహకులను కోరారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న షోరూం డెవలప్‌మెంట్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి, బ్రాంచ్ మేనేజర్ అఖిల్.. యాజమాన్యంతో మాట్లాడి వాహనం అందించేందుకు అంగీకరింపజేశారు. అనంతరం మేనేజర్ అఖిల్ డబ్బాలోని చిల్లర నాణేలను లెక్కించారు. రూ.50 వేల చిల్లర నాణేలతో పాటు మరికొంత నగదును తీసుకుని దంపతులకు టీవీఎస్ మోపెడ్‌ను అందించారు.

తన కష్టాన్ని గుర్తించి, తన కోసం ఇంతకాలం డబ్బు పొదుపు చేసిన భార్య ప్రేమకు విజయరాజు ఆనందంతో మురిసిపోయారు. వాహనం అందించిన షోరూం యాజమాన్యానికి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. భర్త కష్టాన్ని పంచుకోవాలనే భార్య ఆలోచన.. చిల్లర నాణేలతో మొదలైన పొదుపు.. చివరకు ఓ అందమైన బహుమతిగా మారింది. చిన్న మొత్తాలతోనైనా పట్టుదలగా పొదుపు చేస్తే పెద్ద లక్ష్యాలను చేరుకోవచ్చని ఈ దంపతుల కథ మరోసారి నిరూపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us