
కన్నబిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తల్లి చేయని ప్రయత్నం లేదు. రెక్కల కష్టాన్ని ధారపోసింది.. ఉన్న కొద్దిపాటి ఆస్తినీ అమ్మేసింది. అయినా కొడుకు అనారోగ్యం నయం కాలేదు.. వైద్యం కోసం అప్పులు పెరిగిపోయాయి. చివరకు కడుపునిండా తిండి లేక, తలదాచుకునేందుకు నీడ కరువై, బతికుండగానే తన కుమారుడితో కలిసి శ్మశాన వాటికను ఆశ్రయించాల్సిన హృదయవిదారక పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలుగుచూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత గత ఐదేళ్లుగా వేములవాడ పట్టణంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె కుమారుడు మర్రిపల్లి రాకేష్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. కుమారుడిని బతికించుకోవాలనే తపనతో ఇప్పటివరకు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేసింది. వైద్య ఖర్చుల కోసం తనకున్న కాస్త భూమిని విక్రయించడంతో పాటు, ఉన్న స్థలాన్ని తనఖా పెట్టి భారీగా అప్పులపాలైంది.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ కుటుంబానికి ప్రస్తుతం కనీస పోషణ కూడా భారంగా మారింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నివసిస్తున్న ఇంటికి అద్దె కూడా చెల్లించలేని దీనస్థితికి చేరింది. తలదాచుకోవడానికి గూడు లేక, సమాజంలో ఎటు చూసినా ఆదరించే దిక్కు కనపడక, విధిలేని పరిస్థితుల్లో కుమారుడిని వెంటబెట్టుకుని పట్టణంలోని శ్మశాన వాటికలోనే తలదాచుకుంటోంది. బతికి ఉన్న మనుషుల కంటే సమాధులే తమకు నీడనిస్తున్నాయని ఆ తల్లి కన్నీటిపర్యంతమవుతోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో స్పందించి తన కుమారుడి వైద్యానికి అవసరమైన ఆర్థిక సాయం అందించాలని అమృత వేడుకుంటోంది. దాతలు ముందుకొచ్చి తమను ఈ దుర్భర స్థితి నుంచి గట్టెక్కించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తోంది.