Tummidihatti Project: 80 టీఎంసీల నీటి లక్ష్యం.. విద్యుత్ ఖర్చు ఆదా! తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు లెక్కలివే!

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కీలక చర్చలకు రంగం సిద్ధమైంది. ముంబైలో సీఎం రేవంత్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సమావేశంలో బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 150–152 మీటర్లకు పెంచే ప్రతిపాదనపై చర్చించనున్నారు. నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం, విద్యుత్ ఖర్చు తగ్గించడం, ముంపు ప్రభావంపై సాంకేతిక నివేదికలు ఈ భేటీలో కీలకంగా మారనున్నాయి.

Tummidihatti Project: 80 టీఎంసీల నీటి లక్ష్యం.. విద్యుత్ ఖర్చు ఆదా! తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు లెక్కలివే!
Telangana CM Revanth Reddy - Maharashtra CM Fadnavis

Updated on: Oct 26, 2026 | 9:49 AM

తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల FRLతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరిస్తుందా? కేసీఆర్‌ హయాంలో 148 మీటర్లతో జరిగిన ఒప్పందాన్ని ప్రస్తుత సీఎం ఫడ్నవీస్‌ తిరగరాస్తారా? అసలు.. 152మీటర్లకే తెలంగాణ ఎందుకు పట్టుబడుతోంది. మహారాష్ట్రకు ఉన్న అభ్యంతరాలేంటి?. ఇవాళ్టి భేటీ సీఎం రేవంత్ మహా సీఎంకు ఏం వివరించబోతున్నారు?.. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల FRLతో బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించారు. దీంతో 160 టీఎంసీల నీటిని మళ్లించాలనేది లక్ష్యం. బ్యారేజీ ఎత్తు 148 మీటర్లకు కుదించడంతో 2.55 మీటర్ల వాటర్‌ హెడ్‌ తగ్గిపోయింది. ఫలితంగా 150 రోజుల పాటు నీటిని మళ్లించుకున్నా 44 టీఎంసీలకు మించి వాడుకోలేని పరిస్థితి. దీంతో కనీసం వంద టీఎంసీలైనా తరలించేలా బ్యారేజీ నిర్మించాలనేది ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. తుమ్మిడిహెట్టి దగ్గర వార్ధా నదిపై ఒకటి, వెన్‌గంగాపై మరోటి బ్యారేజీ ఒకే కాంప్లెక్స్‌గా కడతారు. లంభాకారంలో బ్యారేజీ నిర్మాణం ఉండనుంది. 152 మీటర్ల ఎత్తుతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. మహారాష్ట్రపై ఒత్తిడి తెచ్చి కనీసం 150 మీటర్లకయినా అనుమతి సాధించాలని సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించి, 76 కిలోమీటర్లు గ్రావిటీతో 80 టీఎంసీల జలాలను తరలించడంతో ఏటా రూ.383 కోట్ల కరెంట్‌ బిల్లుల భారం తప్పుతుందని ప్రభుత్వం లెక్క కట్టింది. 76 కిలోమీటర్లు గ్రావిటీతో, మరో 20 కిలోమీటర్ల మేర టన్నెల్‌ తవ్వి నీటిని వదిలితే 8.25 కిలోమీటర్లు గ్రావిటీతో నీళ్లు వెళ్లి సుందిళ్ల బ్యారేజీలో చేరతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ వివరించనున్నారు.

2016లోనే 148 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించుకునేందుకు ఒప్పందం జరిగింది. అయితే.. నీటి తరలింపు తక్కువగా ఉండటంతో.. ఆదిలాబాద్‌కే దాన్ని పరిమితం చేసి గోదావరి నుంచి ఎక్కువ నీటిని తీసుకునే కాళేశ్వరం డిజైన్ చేసి పూర్తి చేశారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రాణహిత-చేవెళ్ల కట్టి తీరతామని, తుమ్మిడిహెట్టి నిర్మిస్తామని చెప్పింది.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కార్యాచరణను వేగవంతం చేసేందుకు ఏప్రిల్ 29న సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. దీంతో మే 6న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే నెల 26న సీఎం రేవంత్​ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌కు లేఖలు రాశారు. బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావంపై చర్చలకు సమయం కోరారు. కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ జూన్ 11న ప్రధాని మోదీకి లేఖ రాయడంతో PMO దీనిని కేంద్ర జల్‌‌శక్తి శాఖకు పంపింది. ఆగస్టు 5న ఢిల్లీలో కేంద్ర జల్‌‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌‌ను కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. CWPRS పుణె అధ్యయనం ప్రకారం +150 నుంచి +152 మీటర్ల ఎత్తుతోనే విద్యుత్ అవసరం లేకుండా గ్రావిటీతో నీళ్లు అందుతాయని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఇరు రాష్ట్రాల అధికారులు, మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సెప్టెంబర్ 1న ఢిల్లీలో కేంద్ర జల సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల భేటీ జరిగింది. సెప్టెంబర్ 3న పుణె సంస్థ రూపొందించిన బ్యాక్‌‌వాటర్ అధ్యయన నివేదికతో పాటు 148 నుంచి 152 మీటర్ల వరకు ముంపు ప్రభావాన్ని చూపే కాంటూర్ మ్యాపులను రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర జలవనరుల శాఖకు సమర్పించింది. ఇందులో భాగంగా ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌‌లో నిర్వహించే ఇవాళ్టి భేటీలో బ్యారేజీ ఎత్తు పెంపు, అంతర్రాష్ట్ర అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, ఫడ్నవీస్‌ చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో కట్టినా, లేక 152 మీటర్ల ఎత్తుతో నిర్మించినా గ్రామాలు ముంపునకు గురి కావని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. 150 మీటర్ల ఎత్తుతో అయితే 413 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని చాప్రాల ఎకో సెన్సివిటీ జోన్‌లో 382 హెక్టార్లు ముంపునకు గురవుతుంది. తెలంగాణలో 450 హెక్టార్లు మహారాష్ట్రలో 1,256 హెక్టార్లు కలుపుకొని నదీ గర్భం 1,706 హెక్టార్లు ముంపునకు గురవుతుందని తేల్చారు. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 1174 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, తెలంగాణలో 556 హెక్టార్లు, మహారాష్ట్రలో 1,600 హెక్టార్లు కలిపి మొత్తం 2వేల 156 హెక్టార్ల నదీ గర్భం ముంపునకు గురవుతుంది. 545 హెక్టార్ల చాప్రాల ఎకో సెన్సివిటీ జోన్‌ ముంపునకు గురవుతుందని పుణె సంస్థ అధ్యయనంలో తేలింది. ఇవే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిక్కుముడిగా మారాయి. వీటిపై ఇద్దరు సీఎంలు ఒక అవగాహనకు వచ్చి ఒప్పందం చేసుకుంటారా? లేక ఎప్పటిలాగే చర్చలు ప్రతిష్ఠంభనలాగే మిగిలిపోతాయా అన్నది కొన్ని గంటల్లో తేలనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us