
మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీళ్లతో నిండిన బకెట్లో పడి ఏడాదిన్నర వయస్సున్న చిన్నారి మృతి చెందింది. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి అనుకోని ప్రమాదానికి గురికావడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండు బస్తీలో జరిగింది.
స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. చిన్నారి తల్లిదండ్రులు కూలి పనుల కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో చిన్నారి, తన పదేళ్ల అక్క చాందినితో కలిసి ఉంది. చాందిని వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో చిన్నారి ఆడుకుంటూ ఇంట్లోని నీళ్లతో నిండిన బకెట్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బకెట్లో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ప్రాణాలు విడిచింది. చిన్నారి మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
సమాచారం అందుకున్న సూరారం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన పరిస్థితులు, ఇతర వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో నీళ్ల బకెట్లు, తొట్టెలు, ఇతర నీటి నిల్వ పాత్రలను అందుబాటులో ఉంచకూడదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారవచ్చు. పిల్లలను నీటి వనరుల దగ్గర ఎప్పుడూ ఒంటరిగా వదిలేయకూడదు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..