Watch: వర్షాల కోసం దరిద్ర దేవతను ఊరి నుంచి సాగనంపిన జనం.. ఎలానో మీరే చూడండి

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే జెట్టక్క ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామంలో దరిద్రం, అశుభాలు తొలగిపోయి ఐశ్వర్యం, సిరిసంపదలు వెల్లివిరియాలనే ఆకాంక్షతో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత చీపుర్లు, పనికిరాని వస్తువులను ఊరేగింపుగా గ్రామ శివారు వరకు తీసుకెళ్లి సంప్రదాయ ఆచారాలను పాటించారు. మంచి వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని సామూహికంగా ప్రార్థనలు చేశారు. గ్రామ యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో రుద్రంగిలో పండుగ వాతావరణం నెలకొంది..

Watch: వర్షాల కోసం దరిద్ర దేవతను ఊరి నుంచి సాగనంపిన జనం.. ఎలానో మీరే చూడండి
Rudrangi Jettakka Utsavam

Edited By:

Updated on: Jul 13, 2026 | 12:59 PM

రుద్రంగి, జులై 13: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ‘జెట్టక్క’ ఉత్సవం ఘనంగా జరిగింది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో ఉన్న దరిద్రం, అశుభాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి గ్రామ ప్రజలు ఇళ్లలోని పాత చీపుర్లు, పనికిరాని పాత వస్తువులను సేకరించి, డప్పు చప్పుళ్లు, హారతులు, సంప్రదాయ నృత్యాల నడుమ ఊరేగింపుగా గ్రామ శివారు వరకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం ద్వారా దరిద్ర దేవత గ్రామాన్ని విడిచి వెళ్లి, ఐశ్వర్యం, సిరిసంపదలు గ్రామంలో నెలకొంటాయని స్థానికుల విశ్వాసం.

ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులకు మంచి పంటలు పండాలని, గ్రామంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు సామూహికంగా ప్రార్థనలు చేశారు. గ్రామ యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉత్సవంలో పాల్గొని సంప్రదాయాన్ని కాపాడేలా ఉత్సాహంగా నిర్వహించారు.

 

ఆధునిక కాలంలోనూ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగించడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. జెట్టక్క ఉత్సవం సందర్భంగా రుద్రంగిలో పండుగ వాతావరణం నెలకొని, గ్రామమంతా భక్తి, సంప్రదాయం, ఐక్యతను ప్రతిబింబించేలా సందడి కనిపించింది.

Follow Us