తెలంగాణలో KCRను ఎదుర్కొనేందుకు BJP పక్కా వ్యూహం.. కమలనాథుల ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ఎదుర్కొనేందుకు ‘జమిలి’ ఎన్నికలే ఉత్తమ మార్గమని భారతీయ జనతా పార్టీ(BJP) భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటుగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తేనే బీజేపీకి సానుకూలంగా ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది.

తెలంగాణలో KCRను ఎదుర్కొనేందుకు BJP పక్కా వ్యూహం.. కమలనాథుల ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
BJP vs TRS
Follow us

|

Updated on: Aug 20, 2021 | 1:48 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ఎదుర్కొనేందుకు ‘జమిలి’ ఎన్నికలే ఉత్తమ మార్గమని భారతీయ జనతా పార్టీ(BJP) భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటుగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తేనే బీజేపీకి సానుకూలంగా ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది. నిజానికి 2019లో కూడా ఇదే జరిగేదని, ఈ పరిస్థితిని ముందే ఊహించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా 2018లో రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను ముందుకు జరిపారని జనబాహుళ్యంలో ఉన్న చర్చను కమలనాథులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ సారి ఆ అవకాశం దక్కకుండా చేయాలని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.

నిజానికి ఎన్నికల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కానప్పటికీ.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తూ తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించేలా చేసుకోగల్గుతున్నారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల లోపు ఎక్కడైనా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటే, వాటిని సార్వత్రిక ఎన్నికలతో పాటుగా నిర్వహించే వెసులుబాటు, విచక్షణాధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఉంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, 8 నెలల ముందుగా అసెంబ్లీ రద్దు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీకి 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వానికి 2023 డిసెంబర్ వరకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. టర్మ్ పూర్తయ్యే వరకు ఉంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను 2024 తొలి అర్థభాగంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. అప్పుడు జాతీయస్థాయిలో ఏర్పడే మూడ్ కారణంగా ప్రాంతీయ పార్టీల కంటే తమకు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే టర్మ్ పూర్తికాకుండా 6 నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండేలా చూసుకుని అసెంబ్లీని రద్దు చేస్తే  బీజేపీ ఎత్తులు చిత్తయ్యే అవకాశం ఉంది.

Kcr

Telangana CM KCR

జమిలి అస్త్రం! ఇలాంటి పరిస్థితి ఎదురైతే, తమ దగ్గరున్న అస్త్రం జమిలి ఎన్నికలేనని కమలనాథులు చెబుతున్నారు. సాధారణంగా ఐదేళ్ల పదవీకాలం పూర్తికాకముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని లోక్‌సభతో ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేయమంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అందులోనూ తమదికాని పార్టీ ప్రభుత్వాలు అస్సలు ఒప్పుకోవు. అలాంటిది, కోరకుండానే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అసెంబ్లీని రద్దు చేసుకుని కూర్చుంటే, తాము ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించైనా సరే లోక్‌సభ ఎన్నికల వరకు నెట్టుకురావొచ్చని చెబుతున్నారు. పైగా, ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పేరుతో దేశమంతటా చట్ట సభలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదన ఉండనే ఉంది. దీనిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు చేయగా, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి రోడ్ మ్యాప్ రూపొందించే పనిలో లా కమిషన్‌కు నిమగ్నమైన విషయం తెలిసిందే. పదే పదే ఎన్నికల కారణంగా ప్రజాధనం వృధా అవడంతో పాటు కోడ్ కారణంగా పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జమిలి ఎన్నికలే వీటికి పరిష్కారమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం వంటి అసాధ్యమనుకున్నవాటినే సుసాధ్యం చేస్తున్న ఎన్డీయే-2 సర్కారు, లా కమిషన్ సిఫార్సులు అందిన వెంటనే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా ఒక్క తెలంగాణాలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జమిలి ఎన్నికల అదనపు ప్రయోజనాన్ని పొందాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

BJP National President JP Nadda

BJP National President JP Nadda

‘టచ్‌’లో ఉండండి.. ‘టైం’ చెబుతాం.. ఎన్నికల సంగతి పక్కనపెడితే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేయడంపై కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. కారు గుర్తుపై గెలిచినవారి కంటే హస్తం గుర్తుపై గెలిచి, కారెక్కిన నేతలు కొందరు కమలదళంతో రహస్య మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. అలాగే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టడం జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ సీనియర్లు, ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు ఇప్పటికే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, కాషాయ కండువా కప్పుకోడానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే పలువురు నేతలను చేర్చుకున్న బీజేపీ, చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతలను టచ్‌లో ఉండమని, తగిన సమయం వచ్చాక చేరే ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

Eatala Rajendar Joins BJP

Eatala Rajendar Joins BJP

ఓటు బ్యాంకు వేటలో… ఏ రాజకీయ పార్టీకైనా గెలుపును నిర్దేశించేది ఓటు బ్యాంకే. కులం, మతం, ప్రాంతం వంటివన్నీ ఓటు బ్యాంకును పోగేసే అంశాలే. గతంలో కేవలం మతం ఆధారంగా హిందూ ఓట్లకు గాలం వేసిన బీజేపీ, మోదీ-షా నేతృత్వంలో అన్ని రకాల సమీకరణాలకు పెద్ద పీట వేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఓబీసీలను ఓటుబ్యాంకుగా సమీకరించుకోవాలని చూస్తోంది. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత, కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీలకు ప్రాధాన్యత, నీట్ ఆలిండియా కోటాలో రిజర్వేషన్లు సహా ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయాల ద్వారా తమ వైఖరి ఏంటో ఆ పార్టీ చెబుతోంది. తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీల్లో బీజేపీకి మాత్రమే ఓబీసీ నేత రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగానూ తెలంగాణకే చెందిన డా. లక్ష్మణ్‌కు అవకాశమిచ్చింది. జనాభాలో సగం కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఓబీసీలను సమీకరించగల్గితే, దాన్ని మించిన ఓటుబ్యాంకు ఉండదనే భావనలో బీజేపీ నేతలున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ దళిత-మైనారిటీ కాంబినేషన్ సహా ఒకే తరహా ఓటుబ్యాంకు కోసం పోటీ పడతాయని, ఇప్పటికే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలతో విసుగు చెందిన మెజారిటీ వర్గం ఉత్తరాదిన బీజేపీ వెంట నడుస్తుండగా, ఇప్పుడు దళిత బుజ్జగింపు రాజకీయాలను కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ‘దళిత బంధు’ పథకం బెడిసికొడుతుందని, దళితులపై చూపిస్తున్న ఈ ప్రేమ మిగతావర్గాల్లో, ఇతర వెనుకబడిన వర్గాల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలిస్తుందని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. దాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటే, దుర్భేద్యమైన ఓటుబ్యాంకు తయారైనట్టేనని కలలుగంటోంది.

(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ)

Also Read..

టెన్త్ పాసై.. ఉద్యోగం కోసం చూస్తున్న వివాహిత మహిళలకు గుడ్ న్యూస్.. 288 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్

AP Night Curfew: ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకంటే.?

Latest Articles