ఆర్టీసీ ‘మహా’ సమరం.. రెండో రోజూ స్తంభించిన ప్రగతి రథ చక్రం.. డిపోల వద్ద ఉద్రిక్తత!

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేడు రెండో రోజుకు చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. సమ్మెపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. సమ్మె వద్దు - మాయ మాటలు నమ్మొద్దు అంటూ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది.

ఆర్టీసీ మహా సమరం.. రెండో రోజూ స్తంభించిన ప్రగతి రథ చక్రం.. డిపోల వద్ద ఉద్రిక్తత!
Tgsrtc Workers Strike

Updated on: Apr 23, 2026 | 8:30 AM

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేడు రెండో రోజుకు చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్‌తో కార్మికులు ఆందోళన బాట పట్టారు. నేడు గురువారం (ఏప్రిల్ 23) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుట మహాధర్నాకు యూనియన్లు పిలుపునిచ్చాయి. హైదరాబాద్‌లోని రాణిగంజ్ డిపో వద్ద జరగనున్న నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలపనున్నారు.

అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి 9 డిపోలకు చెందిన సుమారు 1,036 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉదయాన్నే కార్మికులు డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. మహబూబాబాద్, తొర్రూరు, వరంగల్ ప్రాంతాల్లో బస్సులను అడ్డుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, పోలీసు కానిస్టేబుళ్ల సాయంతో అద్దె బస్సులను నడిపిస్తున్నారు.

సమ్మెపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. సమ్మె వద్దు – మాయ మాటలు నమ్మొద్దు అంటూ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం, 1947 ప్రకారం చర్చలు పెండింగ్‌లో ఉన్నప్పుడు సమ్మె చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొంటే వేతన కోతతో పాటు ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ చర్చలు ప్రారంభించిందని, సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక పిలుపులను నమ్మి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యాజమాన్యం కోరింది. ప్రస్తుతానికి అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us