
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 15, 16వ తేదీన కొత్త ఓటర్ల నమోదుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పిస్తోంది. 18 ఏళ్లు నిండినవారితో పాటు వివిధ కారణాలతో ఓటు కోల్పోయినవారు కొత్తగా ఓటర్గా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఫారం-6లో వివరాలను నింపి అవసరమైన డాక్యుమెంట్లతో బీఎల్వోలకు అందించాల్సి ఉంటుంది. ఈ రెండు రోజుల పాటు ప్రతీ పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. ఈసీ వెబ్సైట్ ద్వారా ఫారం 6 డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్లైన్లో అయినా ఈ ఫారం తీసుకుని వివరాలు నింపాలి. అనంతరం బీఎల్వోలకు అందిస్తే సరిపోతుంది. కొత్తగా ఓటర్గా నమోదు కావాలనుకునేవారు ఈ అవకాశాన్ని వినిపియోగించాలని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. బీఎల్ఓలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఓటర్ జాబితాలో పేరు లేనివారు ఓటు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారుల పరిశీలన అనంతరం మీకు ఓటర్ ఐడీ జారీ చేస్తారు. దీంతో ఓటర్ల తుది జాబితాలో మీ పేరు వస్తుంది. ఓటర్ల సమగ్ర సవరణ(SIR) ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు కోసం అవకాశం కల్పిస్తున్నారు. ప్రజలకు ఏమైనా అనుమానాలుంటే మీ పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉండే బీఎల్ఓల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. మరోవైపు మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఫారం 18తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్గా నమోదు అయ్యేందుకు నవంబర్ 6 వరకు గడువు విధించారు.
నవంబర్ 25 ముసాయిదా జాబితా విడుదల చేయనుండగా.. డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లగా నమోదు అయ్యేందుకు 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత నియోజకవర్గ పరిధిలో నివసిస్తూ ఉండాలి. పీజీ లేదా అంతకంటే ఎక్కువ చదివినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓరిజినల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ లేనివారు గెజిటెడ్ అధికారి ధృవీకరించిన ఫొటోకాపీని సమర్పించాల్సి ఉంటుంది. ఫారం 18 నింపిన అనంతరం ఏఈఆర్వోకు అందించాల్సి ఉంటుంది. ఈ ఫారంతో పాటు ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు అందించాలి. ఒకేసారి రెండు చోట్ల ఓటర్గా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఒకేచోట మాత్రమే నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.