Telangana: కల్తీకి చెక్.. కస్టమర్ల కళ్లముందే వంట తయారీ.. ఇకపై రెస్టారెంట్ కిచెన్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి!

హమ్మయ్య.. మొత్తానికి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు..తెలంగాణలోని పలు రెస్టారెంట్లలో ఇటీవల వెలుగు చూస్తున్న అపరిశుభ్రత, ఆహర నాణ్యతపై ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని హోట్లళ్లు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.ఈ చర్యలు సక్రమంగా అమలైతే నగరంలోని రెస్టారెంట్లలో సురక్షితమైన ఆహారం అందించే దిశగా మరో ముందడుగు పడనుంది.

Telangana: కల్తీకి చెక్.. కస్టమర్ల కళ్లముందే వంట తయారీ.. ఇకపై రెస్టారెంట్ కిచెన్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి!
Telangana Mandates Cctv Cameras In All Restaurant Kitchens

Edited By:

Updated on: Oct 11, 2026 | 7:51 AM

హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు రెస్టారెంట్లలో తయారైన ఆహారాన్ని మాత్రమే చూస్తున్న వినియోగదారులు.. ఇకపై వంటగదిలో ఆహారం ఎలా సిద్ధమవుతుందో తెలుసుకునే అవకాశం రానుంది. ఇందుకోసం రెస్టారెంట్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టీజీ సేఫ్‌ అధికారులు నిర్వాహకులకు సూచించారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆహార తయారీ ప్రక్రియపై పర్యవేక్షణ పెరగడంతో పాటు, వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

రెస్టారెంట్లలో అపరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, వంటగదుల్లో చెత్తాచెదారం వంటి అంశాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వంటగదుల్లో కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆహారాన్ని సిద్ధం చేసే విధానం, పరిశుభ్రత పాటిస్తున్న తీరును పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆహార తయారీలో పారదర్శకత పెంచడం, నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడం ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఆహార భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో రెస్టారెంట్‌ అసోసియేషన్‌ సభ్యులతో టీజీ సేఫ్‌ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వంటగదుల నిర్వహణ, ముడి పదార్థాల నాణ్యత, ఆహార నిల్వ పద్ధతులు, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రతి రెస్టారెంట్‌ ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించాలని, హైజీన్‌ రేటింగ్‌తో కూడిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) ధ్రువపత్రం పొందాలని సూచించారు.

ఆహార పదార్థాల తయారీలో హానికరమైన రంగులు ఉపయోగించవద్దని అధికారులు హెచ్చరించారు. నిషేధిత పచ్చి గుడ్డుతో తయారు చేసే మయోనైజ్‌ను వినియోగించకూడదని స్పష్టం చేశారు. వంటగదులను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం, నాణ్యమైన ముడి పదార్థాలను ఉపయోగించడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అధికారుల సూచనలపై స్పందించిన రెస్టారెంట్‌ అసోసియేషన్‌ సభ్యులు.. వంటగదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు నెల రోజుల్లో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రెస్టారెంట్ల నిర్వహణలో బాధ్యత పెరగడంతో పాటు, ఆహార భద్రతా ప్రమాణాల అమలును పర్యవేక్షించడం సులభమవుతుంది. అయితే కెమెరాల ఏర్పాటు మాత్రమే కాకుండా, వంటగదుల పరిశుభ్రత, ఆహార నాణ్యత, సిబ్బంది ఆరోగ్య అలవాట్లపై నిరంతర శ్రద్ధ అవసరం. ఈ చర్యలు సక్రమంగా అమలైతే నగరంలోని రెస్టారెంట్లలో సురక్షితమైన ఆహారం అందించే దిశగా మరో ముందడుగు పడనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us