HIV QR Code: క్యూఆర్‌ కోడ్‌తో హెచ్‌ఐవీ రిస్క్‌ అంచనా.. యువతకు టెక్నాలజీతో చేరువ

HIV QR Code: కొత్త క్యూఆర్‌ కోడ్‌ విధానం ద్వారా ప్రజలకు చేరువ కావడం వల్ల హెచ్‌ఐవీపై అవగాహన నుంచి పరీక్ష, కౌన్సెలింగ్‌, చికిత్స వరకు ఉన్న ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పరీక్ష చేయించుకోవడంపై ఉన్న సంకోచాన్ని తగ్గించి, వ్యాధిని తొలిదశలో గుర్తించేందుకు..

HIV QR Code: క్యూఆర్‌ కోడ్‌తో హెచ్‌ఐవీ రిస్క్‌ అంచనా.. యువతకు టెక్నాలజీతో చేరువ
Hiv Code

Edited By:

Updated on: Aug 17, 2026 | 6:20 PM

HIV QR Code: హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలా? అసలు తనకు ఆ ముప్పు ఉందా? అనే సందేహం ఉన్నవారు ఇక నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రాథమికంగా తెలుసుకునే అవకాశం రానుంది. ఇందుకోసం తెలంగాణలో టెక్నాలజీ ఆధారిత కొత్త విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్‌ చేస్తే.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా వ్యక్తిగతంగా హెచ్‌ఐవీ రిస్క్‌ను అంచనా వేసుకునే సదుపాయం కల్పించనున్నారు.

హెచ్‌ఐవీపై అనుమానం ఉన్నా పరీక్ష చేయించుకునేందుకు చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. ఇతరులకు విషయం తెలిసిపోతుందనే భయం, ఆసుపత్రికి వెళ్లేందుకు సంకోచం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కొత్త విధానాన్ని రూపొందిస్తున్నారు. వ్యక్తి తన మొబైల్‌లోనే వివరాలను నమోదు చేసుకునేలా వ్యవస్థ ఉండటంతో తొలి దశలో ఎలాంటి ప్రత్యక్ష సంప్రదింపులు అవసరం ఉండదు. ఇచ్చిన సమాధానాలను బట్టి హెచ్‌ఐవీ పరీక్ష అవసరం ఉందా? లేదా? అనే దానిపై సూచనలు అందుతాయి. పరీక్ష అవసరమని తేలితే సమీపంలోని కేంద్రానికి వెళ్లేలా సమాచారం కూడా అందుతుంది.

ఈ సదుపాయాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను అధికారులు ఎంచుకుంటున్నారు. రైల్వే, బస్‌ స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థలు, కళాశాలలు, ఐటీ హబ్‌లలో క్యూఆర్‌ కోడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలకు హాజరుకాకుండానే ఎవరికి వారు తమ మొబైల్‌ ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.

ఈ కార్యక్రమంలో యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. హెచ్‌ఐవీపై సందేహాలు ఉన్నప్పటికీ పరీక్షల విషయంలో వెనుకంజ వేసే యువతకు డిజిటల్‌ విధానం సులభమైన మార్గంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆరోగ్య సిబ్బందిని నేరుగా కలవకుండానే తొలి దశలో సమాచారం పొందే అవకాశం ఉండటం వల్ల పరీక్షలపై ఉన్న భయం, సంకోచం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె. విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. ప్రజల్లో హెచ్‌ఐవీపై అవగాహన పెంచడం, ముప్పు ఉన్నవారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా సమీపంలోని పరీక్షా కేంద్రాలు, యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ కేంద్రాల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు.

హెచ్‌ఐవీతోపాటు సిఫిలిస్‌పై అవగాహన పెంచేందుకు కూడా కార్యక్రమాలను విస్తరించనున్నారు. ఇందుకోసం విద్యార్థులు, యువత, కార్పొరేట్‌ ఉద్యోగులు, ఇతర కీలక వర్గాలను భాగస్వామ్యం చేస్తూ సమాచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ సంస్థల సహకారంతో ఈ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 127 ఇంటిగ్రేటెడ్‌ కౌన్సెలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్లు, 11 మొబైల్‌ ఐసీటీసీలు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా 22 ఏఆర్‌టీ కేంద్రాలు, పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మరో 11 ఏఆర్‌టీ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి.

కొత్త క్యూఆర్‌ కోడ్‌ విధానం ద్వారా ప్రజలకు చేరువ కావడం వల్ల హెచ్‌ఐవీపై అవగాహన నుంచి పరీక్ష, కౌన్సెలింగ్‌, చికిత్స వరకు ఉన్న ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పరీక్ష చేయించుకోవడంపై ఉన్న సంకోచాన్ని తగ్గించి, వ్యాధిని తొలిదశలో గుర్తించేందుకు ఈ డిజిటల్‌ విధానం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Auto Tips: కారు ఇంజన్‌లో కూలెంట్‌ అయిపోతే ఏమవుతుంది? కలిగే నష్టం ఏంటి?

Loading...
Unable to load recommendations.
Follow Us