
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోన్న విషయం తెలిసిందే. మహిళలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించేందుకు ఇప్పటికే వారి ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అద్దె ఆర్టీసీ బస్సులు, డెయిరీ ఫామ్‌లు ఏర్పాటు చేయించగా.. ఇప్పుడు అదే తరహాలో వారికి ఆదాయ మార్గం చూపించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అదేంటంటే.. మహిళా స్వయం సహాయక సంఘాలతో మిల్లెట్ కేప్‌లను ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ కేఫ్‌ల కోసం రూ.11 కోట్లు ఖర్చు కానుండగా.. ఒక్కొ కేఫ్‌కు రూ.2.2 కోట్ల వ్యయం కానుంది.
నవంబర్ 19వ తేదీన ఈ కేఫ్‌లను ప్రభుత్వం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆలోగా 40 మంది మహిళలకు శిక్షణ కూడా పూర్తి చేశారు. తొలుత హైదరాబాద్‌లో మూడు మిల్లెట్ కేప్‌లు నెలకొల్పనుండగా.. యాదాద్రి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. మొత్తం తొలి విడతలో ఐదు కేఫ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ కేఫ్‌ల ద్వారా మహిళలకు ఆదాయం లభించనుడగా.. చిరు ధాన్యాల ఉత్పత్తులకు కూడా మార్కెటింగ్ సౌకర్యం లభించనుంది. ఇలా రెండు విధాలుగా ఈ కేఫ్‌లు ఉపయోగపడనున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదిన ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనుండగా.. వీటికి వచ్చే ఆదరణను బట్టి ఇతర జిల్లాలకు కూడా విస్తరించనున్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వీటిని నెలకొల్పనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వీటికి ఆమోదం కూడా లభించింది.
కేప్‌ల నిర్వహణతో పాటు ఆహార పదార్థాల తయారీ, వ్యాపార నిర్వహణకు సంబంధించి మహిళలకు భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థశిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే 40 మంది మహిళలకు శిక్షణ కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కేఫ్‌లలో మిల్లెట్లతో తయారుచేసిన వివిధ ఆహార పదార్థాలు ఉంటాయి. రాజి జావ, రాగి సంకటి, మిల్లెట్ ఉప్మా, కిచిడీ, మిల్లెట్ కేకులు, బిస్కెట్లు లాంటివి తయారుచేసి విక్రయించనున్నారు. హైదరాబాద్ విషయానికొస్తే బీఆర్కే భవన్, మాదాపూర్ ఇందిరా మహిశా శక్తి బజార్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే కేఫ్‌ల నిర్మాణు పనులు కూడా పూర్తి కావొచ్చాయి. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబరు 19వ తేదీన ఈ మిల్లెట్ కేఫ్‌లను ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.