తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌.. క్రీడాకారుల ఎంపిక ప్రక్రియపై మంత్రి కీలక ఆదేశాలు

తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి జరగనున్న ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశంపై సమీక్ష నిర్వహించిన మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయడం, స్టేడియాల సిద్ధత, పారదర్శక ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో జరగబోయే పోటీలను దేశానికే ఆదర్శంగా ఉండేలా నిర్వహించాలన్నారు.

తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌.. క్రీడాకారుల ఎంపిక ప్రక్రియపై మంత్రి కీలక ఆదేశాలు
Telangana Prepares For Khelo India Games

Edited By:

Updated on: Oct 23, 2026 | 9:46 PM

తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు జరగనున్న ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. పోటీల నిర్వహణ ఏర్పాట్లు, క్రీడాకారుల ఎంపిక, స్టేడియాల సిద్ధత, శిక్షణ, వసతి తదితర అంశాలపై శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మొత్తం 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతులను గుర్తించేందుకు 1:4, 1:2, 1:1 నిష్పత్తుల ఆధారంగా దశలవారీగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రతిభ ఆధారంగానే క్రీడాకారులకు అవకాశాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా, తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

స్టేడియాల సిద్ధతపై ప్రత్యేక దృష్టి

ఖేలో ఇండియా గేమ్స్‌ నిర్వహించనున్న స్టేడియాలు, క్రీడా వేదికలను ముందుగానే గుర్తించి, అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాలు, ఇతర ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి అంశానికి సంబంధించి అధికారులకు నిర్దిష్ట బాధ్యతలు అప్పగించి, ఏర్పాట్ల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. క్రీడాకారుల శారీరక దృఢత్వం, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నాణ్యమైన శిక్షణతోపాటు పోషకాహారం అందించాలని తెలిపారు. వైద్య సహాయం, వసతి, రవాణా వంటి సదుపాయాలను కూడా సమర్థవంతంగా కల్పించాలని స్పష్టం చేశారు.

దేశానికే ఆదర్శంగా పోటీల నిర్వహణ

తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పిస్తూ, పోటీల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ పోటీలు రాష్ట్ర క్రీడా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడంతోపాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలవాలని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us