Telangana: ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే స్లాట్ బుక్ కాదు..

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఇక అంత ఈజీ కాదు. లెర్నింగ్ లైసెన్స్‌ కోసం ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకుని, కేవలం డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అయితే సరిపోదు. ఇకపై ఈ ప్రక్రియలో మరో కీలకమైన అంశం చేరబోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆన్‌లైన్ వీడియో కోర్సును పూర్తి చేయాల్సిందే. ఆ కోర్సు ఏంటీ..? ఎలా చేయాలి..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుదాం..

Telangana: ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే స్లాట్ బుక్ కాదు..
Telangana Driving Licence New Rules

Edited By:

Updated on: Oct 13, 2026 | 4:50 PM

వాహనాలు నడపడానికి లైసెన్స్‌ చేతిలో ఉంటే సరిపోదు.. రోడ్డుపై బాధ్యత కూడా ఉండాలి.. వాహనం నడపడం ఒక నైపుణ్యమైతే.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం సామాజిక బాధ్యత. అందుకే డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ ప్రక్రియలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త మార్పులను తీసుకువస్తోంది. యువతకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే దిశగా రవాణా శాఖ కొత్త విధానంపై దృష్టి సారిస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో నూతన ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరిస్తోంది. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికీ రోడ్డు భద్రతపై సరైన అవగాహన కల్పిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఉద్దేశంతో రవాణా శాఖ లైసెన్స్ ప్రక్రియలో మార్పులు చేస్తోంది.

కొత్త విధానం ఎలా ఉంటుంది?

వాహనాల స్టీరింగ్ పట్టుకునే ముందు ప్రతి ఒక్కరూ ఇకనుండి రోడ్డు భద్రతా పాఠాలు నేర్చుకోవాల్సిందే. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకునేలా తెలంగాణ రవాణా శాఖ కొత్తగా ఆన్‌లైన్ వీడియో కోర్సును తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్‌ పొందాలనుకునేవారు సుమారు రెండున్నర గంటలపాటు సాగే ఈ కోర్సును పూర్తి చేయాలి. ఆ తర్వాత నిర్వహించే పరీక్షలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది.

ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై రవాణా శాఖ డిజిటల్ శిక్షణ..

లెర్నింగ్ లైసెన్స్‌ పొందిన తర్వాత పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం వెళ్లే అభ్యర్థులకు ఈ ఆన్‌లైన్ శిక్షణ కీలకం కానుంది. ఆరు మాడ్యూల్స్‌గా రూపొందించిన కోర్సులో ఒక్కో మాడ్యూల్‌ సుమారు 25 నిమిషాల పాటు ఉంటుంది. మొత్తం 120కి పైగా చిన్న వీడియోల ద్వారా రోడ్డు భద్రతా నిబంధనలు, ప్రమాదాలను ముందుగానే గుర్తించే విధానాలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై అవగాహన కల్పిస్తారు. రోడ్డు ప్రమాదాల్లో వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కీలక కారణాలుగా మారుతున్నాయి. సిగ్నల్ దగ్గర ఎప్పుడు ఆగాలి? ప్రమాదకర మలుపుల వద్ద ఎలా వ్యవహరించాలి? ఇతర వాహనాలకు ఎంత దూరం పాటించాలి? రోడ్డుపై అకస్మాత్తుగా ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి అంశాలపై ఈ కోర్సు అవగాహన కల్పించనుంది. వీడియోలు చూసినంత మాత్రాన సరిపోదు.. వాటిపై నిర్వహించే అసెస్‌మెంట్‌లోనూ అర్హత సాధించాలి. అందుకు కనీస మార్కులు సాధించిన తర్వాతే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించే విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఫేస్ రికగ్నైజేషన్‌తో పర్యవేక్షణ.. తల తిప్పితే వీడియో కట్..

ప్రతి దరఖాస్తుదారుడి సెల్ ఫోన్‌కు రవాణా శాఖ నుంచి ఒక లింక్ వస్తుంది. దీనిని నెల రోజుల్లోపు ఎప్పుడైనా ఆ లింక్ పై క్లిక్ చేసి ఎల్ఎల్ఆర్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయితే ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే లింక్ ఓపెన్ వెంటనే ఫేస్ రికగ్నైజేషన్ విధానం ద్వారా అభ్యర్థి ముఖాన్ని స్కాన్ చేసి వీడియో ప్రారంభమవుతుంది. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. రెండున్నర గంటల పాటు ఉన్న ఈ ఆన్‌లైన్ వీడియోలను త్వరగా ముందుకు జరిపి కోర్సును ముగించేయడం.. మరొకరితో వీడియోలు చూపించడం వంటి వాటికి అవకాశం లేకుండా పకడ్బందీ డిజిటల్ పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దరఖాస్తుదారుడికి బదులు వేరే వ్యక్తి వీడియో చూసినా, కనీసం తల పక్కకు తిప్పినా వీడియో ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. కోర్సును ఒకేసారి పూర్తి చేయలేకపోతే మధ్యలో ఆపి, తర్వాత కొనసాగించే వెసులుబాటు ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో శిక్షణ అందుబాటులో ఉండటంతో వివిధ ప్రాంతాల అభ్యర్థులకు ప్రయోజనం కలగనుంది. స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టాబ్లెట్‌ ద్వారా కూడా కోర్సును పూర్తి చేసే సదుపాయం ఉంది.

ఈ ఆన్ లైన్ వీడియో టెస్ట్‌ను మధ్యలో ఆపి, మరుసటి రోజు అక్కడి నుంచే చూసే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ వీడియో పూర్తిగా చూసి, టెస్టులో ఉత్తీర్ణత సాధిస్తేనే శాశ్వత లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి వాహనాన్ని నడిపి డ్రైవింగ్ టెస్టులో ఉత్తీర్ణులు కావాలి. ఒకవేళ వీడియో టెస్టు పాస్ కాకపోతే లైసెన్స్ పొందడానికి ముందుకు వెళ్లలేరు. అయితే ప్రస్తుతం ఈ విధానం పైలట్ ప్రాజెక్టుగా యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ప్రణాళికపై రవాణా శాఖ దృష్టి సారించింది.

కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారిలో రోడ్డు ప్రమాదాల నివారణ, బాధ్యతాయుత మైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించడమే ఈ ఆన్ లైన్ వీడియో టెస్ట్ ముఖ్య ఉద్దేశమని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో వీడియో పాఠాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us