Munugode Bypoll: మునుగోడు మొనగాడు ఎవరు..? హీట్ పెంచుతున్న అభ్యర్థుల ప్రచారం.. తాజా అప్‌డేట్స్

మునుగోడు ఉప ఎన్నికకు నగారా మోగడంతో... ప్రచారంపై దృష్టిపెట్టాయి ప్రధాన పార్టీలు. అధికార ప్రతిపక్ష పార్టీలు.. ఈ బైపోల్‌లో గెలిచి తీరాలన్న కసితో.. గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. విజయం తమదంటే తమదంటూ... ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సందు దొరికితే చాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయ్‌.

Munugode Bypoll:  మునుగోడు మొనగాడు ఎవరు..? హీట్ పెంచుతున్న అభ్యర్థుల ప్రచారం.. తాజా అప్‌డేట్స్
Munugode Bypoll
Follow us

|

Updated on: Oct 09, 2022 | 5:31 PM

మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక ప్రతిపక్షాలు.. బస్తీమే సవాల్‌ అంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల ముఖ్యులందరూ… క్షేత్రస్థాయిలో పనిమొదలెట్టారు. కీలకనేతలంతా.. గ్రామగ్రామాన తిష్టవేసి గెలుపునకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా… మునుగోడులో మూలమూలనా తిరుగుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతే ధీటుగా ప్రచారంలో దూసుకెళ్తూ.. హీటు పెంచుతున్నాయ్‌ కాంగ్రెస్‌, బీజేపీలు. ఇప్పటికే నియోజకవర్గంలో మకాం పెట్టేసిన మంత్రి మల్లారెడ్డి… తనస్టయిల్‌లో ప్రచారం మొదలెట్టేశారు.చౌటుప్పల్ మండలంలో ఓటర్లను ఎట్రాక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మునుగోడు అడ్డాలో ఈసారి ఎగిరేది టీఆర్‌ఎస్‌ జెండానే అని ధీమా వ్యక్తం చేసిన మంత్రి… కాంగ్రెస్‌, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

లక్షకోట్లు ఖర్చుచేసినా తన గెలుపు ఆపలేరన్న రాజగోపాల్‌

తెలంగాణకు శ్రీరామ రక్ష బీజేపీయేనన్నారు … కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. మోదీ, అమిత్‌ షాల అండతో రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కేంద్రం సాయంతో మునుగోడును అభివృద్ధిలో నెంబర్‌ వన్‌గా చేస్తానన్నారు. కేసీఆర్‌ లక్షకోట్లు ఖర్చు పెట్టినా.. మునుగోడులో తన గెలుపును ఆపలేరన్నారు రాజగోపాల్‌. రాజగోపాల్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు కేంద్రమంత్రి భూపేందర్‌సింగ్‌. తెలంగాణలో కుటుంబ పాలనకు మునుగోడు ఫలితంతో చరమగీతం పలకాలన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ విఫలమైందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ క్విడ్‌ప్రోకో ఇష్యూ కాక రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 18వేల కోట్ల కాంట్రాక్టు తమ కంపెనీకి వచ్చిందంటూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి చేసిన కామెంట్‌ ఇప్పుడు పొలిటికల్‌ హీట్‌ పెంచింది. ముందస్తు ఒప్పందం ప్రకారమే కాంట్రాక్టు వచ్చిందని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత రాజగోపాల్‌కు లేదని వాదిస్తోంది. ఇందులో భాగంగానే రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌లో ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ పనులు తీసుకొని రాజగోపాల్‌ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని ఈసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అటు, అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించి దూకుడు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ… ప్రచారంలోనూ అదే హోరును కొనసాగిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పటికే ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు. రేవంత్‌ రెడ్డి సైతం మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పీసీసీ కీలక నేతలంతా అక్కడే మకాం వేసి ప్రచారసరళిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, మునుగోడు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది బీజేపీ. ఆయనపై ఉన్న 3 కేసుల వివరాలను కూడా మెన్షన్‌ చేసిన బీజేపీ.. ఈ కేసులన్నింటినీ ప్రభుత్వం కక్ష పూరితంగా పెట్టినవని ఆరోపించింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజగోపాల్‌రెడ్డికి మంచి పేరుందని, ఆయన పేరు ఒక్కటే తమ పరిశీలనకు రావడంతో అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..