వరదలొచ్చినా.. ఉప్పెనొచ్చినా.. భారీ అగ్నిప్రమాదాలు సంభవించినా.. బిల్డింగులు కూలినా.. ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్ రావాల్సిందే. రెస్క్యూ చేయాల్సిందే. ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్ వచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి. అయితే ఇదంతా గతం అంటోంది తెలంగాణ ఫైర్ డిపార్మెంట్. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు ధీటుగా తమ సిబ్బందిని తీర్చిదిద్దామంటోంది. విపత్తేదైనా.. డోంట్ కేర్ అంటూ తమ బలగాలు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయంటోంది ఫైర్ డిపార్ట్‌మెంట్. ఫైర్ సిబ్బంది.. ఫైర్ బ్రాండ్‌లా ఎలా మారారు.? సాహసోపేతంగా ఎలా తీర్చిదిద్దారు.? ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైర్.. ఫైర్స్ ది ఫైర్ ! ఫైర్ విల్ బి ఫైర్ ! ఫైర్ అల్వేస్ ఫైర్స్..!! అంటోంది తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్. తమ సిబ్బంది ఒక్కొక్కరు ఒక్కో మిసైల్‌గా మారారంటోంది. ప్రమాదమేదైనా.. విపత్తేదైనా.. మేమున్నామంటూ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నరని చెప్తోంది. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ.. అప్‌గ్రేడెడ్ స్కిల్స్‌తో.. ఫైర్ ఫైటర్స్‌ని తీర్చిదిద్దింది తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్. అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే.. నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని శ్రమిస్తాయి ఫైర్ టీమ్స్. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ రెస్క్యూ చేయడం. చిక్కుకున్న వారిని కాపాడటం చేస్తున్నారు ఫైర్ ఫైటర్స్. అలాంటి ఫైర్ సిబ్బందిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతోంది తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్. కేవలం అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా.. ఎవరైనా నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నా.. వరదల్లో చిక్కుక్కున్నా.. బోటు తిరగబడి నీటిలో పడిపోయినా.. కొండలు, క్వారీల్లో చిక్కుకున్నా.. ఎలాంటి ప్రమాదమైనా రెస్క్యూ చేసే విధంగా ఫైర్ సిబ్బందిని సిద్ధం చేశారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఇండియన్ రెస్క్యూ అకాడమీ సహాయంతో.. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో.. తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా ఫైర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫైర్ ఫైటర్స్‌కు బోట్ డ్రైవింగ్, స్కూబా డైవింగ్, స్విమ్మింగ్ టెక్నిక్స్, రెస్క్యూ ఆపరేషన్స్, రోప్ రెస్క్యూ వంటి వాటిపై శిక్షణ ఇచ్చారు. మాదాపూర్ దుర్గం చెరువు వద్ద బోట్లతో బోట్ డ్రైవింగ్‌లో మెలకువలు నేర్పారు. ఎవరైనా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడితే ఎలా రక్షించాలో శిక్షణ ఇచ్చారు. బోటు ప్రమాదం జరిగో.. ప్రమాదవశాత్తో ఇద్దరు ముగ్గురు నీటిలో పడితే వాళ్లను ఎలా రక్షించాలి.. అనే వాటిపై ప్రత్యేక ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. రెస్క్యూకి వెళ్లిన బోటే తిరగబడితే.. వెంటనే బోట్‌ను ఎలా రీసెట్ చేసుకోవాలి.. అనే దానిపై కూడా ట్రైనింగ్ ఇచ్చారు. నీటిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఒడ్డుకు చేర్చడమే కాకుండా.. వారి ప్రాణాలు నిలబెట్టేలా ట్రైనింగ్ ఇచ్చారు. నీళ్లు మింగిన వ్యక్తి నోటి నుంచి నీళ్లు బయటకు రావాలంటే.. ఏ పొజిషన్‌లో ఉంచాలి.. ఎక్కడెక్కడ నొక్కితే నీళ్లు బయటకు వస్తాయి.. శ్వాస అందకపోతే నోటితో శ్వాస కృత్రిమంగా ఎలా అందించాలి.. సీపీఆర్ ఎలా చేయాలి.. అనే విషయాలపైనా శిక్షణ ఇచ్చారు. కేవలం నీటిలో ప్రమాదవశాత్తు పడిన వారినో.. ఆత్మహత్యకు పాల్పడిన వారినో కాపాడటం కాకుండా.. ఎత్తైన కొండలు, హైరైజ్డ్ బిల్డింగ్స్, క్వారీలు లాంటి వాటిలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో కూడా ఫైర్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
దశలవారీగా ఫైర్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని.. ఒక్కో బ్యాచ్లో 50 మందికి చొప్పున ట్రైన్ చేస్తున్నామన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నతాధికారులు. హైదరాబాద్‌లో ఉన్న ఫైర్ సిబ్బందికి మాత్రమే కాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న ఫైర్ సిబ్బందికి ఈ శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు. ఇండియన్ రెస్కూ అకాడమీ.. ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్స్, డీఆర్‌ఎఫ్ టీమ్స్‌కి శిక్షణ ఇస్తోందని.. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఫైర్ సిబ్బందికి శిక్షణ ఇస్తోందన్నారు ట్రైనర్. మొత్తం 22 రాష్ట్రాల్లో తమ శిక్షణ కొనసాగుతోందని.. ఇలాంటి ట్రైనింగ్ ద్వారా ఉద్యోగుల్లో మనోధైర్యంతోపాటు.. కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుందంటున్నారు. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి.. ఇలా పంచబూతాల్లో ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించినా.. మేమున్నామంటున్నారు ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రమాదాలు జరిగిన రెస్కూ చేసేందుకు టీమ్స్‌ను సిద్ధం చేసింది ఫైర్ శాఖ. ఇప్పటివరకు అగ్నితో చెలగాటమాడుతూ.. ప్రాణాలు పణంగా పెట్టి ఎంతోమందిని కాపాడిన తాము.. ఇప్పుడు మరింత శక్తివంతంగా తయారవడం మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చిందంటున్నారు ఫైర్ ఫైటర్స్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..