
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా క్రేజ్, రీల్స్ పిచ్చి కాపురాల్లో చిచ్చులు పెడుతోంది. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు పచ్చని సంసారాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్ చేయవద్దని భర్త వారించినందుకు మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకుంది.
11 ఏళ్ల బంధం.. ఇద్దరు పిల్లలు
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు (మం) మామిడాల ఆర్‌అండ్‌ఆర్ (R&R) కాలనీకి చెందిన తేజస్విని (35) కి, జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డితో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నార్కోటిక్స్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం గజ్వేల్ పట్టణంలోని లక్ష్మీప్రసన్ననగర్ కాలనీలో నివాసం ఉంటోంది. కొంతకాలం క్రితం తేజస్విని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అందులో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మొదలుపెట్టింది.
కొంపముంచిన రీల్స్..!
అయితే, భార్య ఇలా నిత్యం సోషల్ మీడియాలో రీల్స్ చేయడాన్ని భర్త గోపాల్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. రీల్స్ అప్‌లోడ్ చేయడం ఆపాలని భర్త గోపాల్‌రెడ్డి మందలించడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఈ క్రమంలోనే భర్త తనను రీల్స్ చేయవద్దని వారించడంతో తీవ్ర మనస్తాపానికి, తీవ్ర మానసిక ఆందోళనకు లోనైన తేజస్విని బలవన్మర ణానికి పాల్పడింది.
ఉరివేసుకుని ఆత్మహత్య!
ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకుని గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. రీల్స్, సోషల్ మీడియా వ్యామోహం కారణంగా ఒకే ఒక్క క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల,ఇద్దరు చిన్నారులు తల్లికి దూరమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆనందంగా ఉండాల్సిన కుటుంబంలో ఈ ఘటనతో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..