ముళ్ల కంపల్లో 800 ఏళ్ల నాటి నంది.. నారాయణపేట జిల్లాల్లో బయటపడిన కాకతీయుల శిల్పకళ

నారాయణపేట జిల్లా జక్లేర్‌లో కాకతీయుల కాలం నాటి అరుదైన చారిత్రక శిల్పం బయటపడింది. సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన నంది విగ్రహం రెండు ముక్కలై రోడ్డుపక్కన అనాథగా పడి ఉండటం చరిత్రకారులను ఆందోళనకు గురిచేసింది. ఒకప్పుడు ఆలయంలో కొలువుదీరి పూజలందుకున్న ఈ విగ్రహం ప్రస్తుతం దయనీయ స్థితికి చేరుకుంది. దీంతో విషయం తెలుసుకున్న పురావస్తు అధికారులు దీనిని కాపాడి, ఆంజనేయస్వామి ఆలయం వద్ద భద్రపరచాలని సూచించారు

ముళ్ల కంపల్లో 800 ఏళ్ల నాటి నంది.. నారాయణపేట జిల్లాల్లో బయటపడిన కాకతీయుల శిల్పకళ
Kakatiya Nandi Sculpture

Edited By:

Updated on: Nov 13, 2026 | 5:33 PM

ఒకప్పుడు ఆలయంలో కొలువై భక్తుల పూజలందుకున్న నంది.. ఇప్పుడు రోడ్డు పక్కన ముళ్ల కంపల్లో దీనస్థితిలో కనిపిస్తోంది. దాదాపు 800 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ శిల్పం రెండు ముక్కలుగా విరిగిపోయి నిర్లక్ష్యానికి గురవుతోంది. కాకతీయుల కాలం నాటి అపురూప శిల్పకళా సంపదకు ఈ దుస్థితి రావడం చరిత్రాభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో వెలుగుచూసిన ఈ నంది విగ్రహాన్ని కాపాడుకోవాలంటున్నారు పురావస్తు పరిశోధకులు.

మక్తల్ పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జక్లేర్ గ్రామం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ 13వ శతాబ్దం నాటి కాకతీయుల కాలపు త్రికూటాలయం ఉంది. మూడు ఆలయాలతో నిర్మించిన ఈ దేవాలయంలో ప్రస్తుతం ఒక ఆలయానికి మాత్రమే శిఖరం మిగిలి ఉంది. మిగతా రెండు ఆలయాల శిఖరాలు, రంగమండపం శిథిలమయ్యాయి. ఒక ఆలయంలో ఉమామహేశ్వర విగ్రహం, మరో ఆలయంలో శివలింగం భిన్నమై కనిపిస్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే.. ప్రధాన ఆలయం ముందు జైన మతానికి సంబంధించిన పార్శ్వనాథుడి విగ్రహం ఉంది. సుమారు నాలుగు అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహం 23వ జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడిదని పురావస్తు పరిశోధకుడు గుర్తించారు. ఇక్కడి ఆలయాలు, శిల్పాలు జక్లేర్ గత చరిత్రను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

జక్లేర్‌లోని ఆంజనేయస్వామి ఆలయం ముందు రోడ్డు పక్కన ముళ్ల కంపల్లో రెండు ముక్కలుగా విరిగిపోయిన నంది విగ్రహం ఉంది. కాకతీయుల కాలానికి చెందిన ఈ శిల్పం సుమారు 800 ఏళ్ల నాటిదిగా గుర్తించారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న విగ్రహం రక్షణ లేకుండా పడిఉండటాన్ని పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. వారసత్వ కార్యకర్తలు గవినోళ్ల మహేందర్ రెడ్డి, కలాల్ భాస్కర్ గౌడ్ ఇచ్చిన సమాచారంతో జక్లేర్‌ను సందర్శించిన ఆయన.. త్రికూటాలయం, ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని శిల్పాలను పరిశీలించారు.

నంది విగ్రహాన్ని వెంటనే సంరక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. నంది విగ్రహాన్ని ముళ్ల కంపల నుంచి తొలగించి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో భద్రపరచాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు సూచించారు. ఒక పీఠంపై ఉంచి, దాని చారిత్రక ప్రాధాన్యతను తెలియజేసే సమాచార బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఇలాంటి శిల్పాలు కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందని పేర్కొన్నారు. గ్రామస్తులు, యువత ముందుకొచ్చి వారసత్వ సంపదను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా చరిత్రను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. దానికి సాక్ష్యంగా నిలిచిన ఆనవాళ్లను కాపాడుకోవడం సైతం అంతే ముఖ్యం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us