
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దట్టమైన పాకాల అటవీ ప్రాంతం అరుదైన వన్యప్రాణులు, పక్షి జాతులకు నిలయంగా నిలుస్తుంది. తాజాగా ఇక్కడి బయోడైవర్సిటీ పార్కులో భారీ ఆకారంతో కూడిన అత్యంత అరుదైన గ్రే హెడెడ్ ఫిష్ ఈగిల్ దర్శనమిచ్చింది. విదేశీ జాతికి చెందిన ఈ అరుదైన గద్దను చూసి సందర్శకులు, పక్షి ప్రేమికులు అవాక్కయ్యారు. ఈ అరుదైన గద్ద ప్రత్యేకమైన శరీర వర్ణంతో సందర్శకులను కట్టిపడేసింది. బూడిద రంగు తల, మెడ భాగం, ముదురు గోధుమ రంగు రెక్కలతో పాటు తెల్లటి దిగువ భాగంతో ఆకట్టుకునేలా ఉంది. సాధారణంగా పెద్ద సరస్సులు, నదులు, చిత్తడి నేలలు వంటి సహజ నీటి వనరుల పరిసరాల్లోనే సంచరించే ఈ చేపల గద్ద.. పాఖాల బయోడైవర్సిటీ పార్క్ పరిసరాల్లో కనిపించడంతో సందర్శకులు పోటీపడి తమ కెమెరాల్లో బంధించారు.
దట్టమైన పచ్చని అడవులు, చారిత్రక పాకాల సరస్సు, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ఈ ప్రాంతం పక్షి వీక్షణకు పెట్టింది పేరు. స్థానిక, వలస పక్షులతో నిత్యం కళకళలాడే పాఖాల అభయారణ్యంలో ఇప్పుడు గ్రే హెడెడ్ ఫిష్ ఈగిల్ కనిపించడం ఇక్కడి సమృద్ధి జీవవైవిధ్యానికి స్పష్టమైన నిదర్శనమని ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన పాఖాల సరస్సు, అటవీ ప్రాంతాన్ని మరింత పకడ్బందీగా పరిరక్షించాలని పర్యావరణవేత్తలు, స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి అరుదైన జీవజాతులు నిరంతరం ఇక్కడికి రావాలంటే అడవులను కాపాడటంతో పాటు పర్యావరణ సమతుల్యతను నిలబెట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.