
తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అలాగే ద్రోణి ఒకటి వాయువ్య ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనము నుండి ఉత్తర జార్ఖండ్ ప్రాంతంలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం మీదుగా ఉత్తరాంధ్ర కోస్తా తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో ఏర్పడింది. నిన్న ఉత్తర బీహార్ పరిసర ప్రాంతాల నుండి దక్షిణ తెలంగాణ వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈరోజు బలహీనపడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయిన హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఈరోజు రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తన ప్రకటనలో తెలిపింది.