Telangana: గ్యాస్ సిలిండర్ వాహనాలకు పోలీస్ ఎస్కార్ట్.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ముందో పోలీస్ వాహనం.. వెనుకో పోలీస్ వాహనం.. ఎస్ఐ స్థాయి అధికారులతో ఎస్కార్ట్... అక్కడ సీన్ చూస్తే ఎవరో మంత్రికో లేక అంతకంటే ముఖ్యమైన వారికి పోలీస్ ఎస్కార్ట్ అనిపిస్తుంది. కానీ అసలు సీన్ చూస్తే అవాక్కవాల్సిందే.. ఆ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల వాహనాలకు పోలీసులు కల్పిస్తున్న అసాధారణ భద్రత చూసి జనమంతా నివ్వేరబోతున్నారు.. గ్యాస్ వాహనాలకు పోలీసులు భద్రత గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: గ్యాస్ సిలిండర్ వాహనాలకు పోలీస్ ఎస్కార్ట్.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Police Escort For Gas Cylinders Vehiccles

Edited By:

Updated on: May 15, 2026 | 7:40 AM

పశ్చిమాసియాలో యుద్ధానికి కాస్త బ్రేక్ పడినా ఇక్కడ వంటింట్లో గ్యాస్‌తో కుస్తీ మాత్రం తప్పడం లేదు. గ్యాస్ కొరత కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో పాటు గ్యాస్ కొరత తోడవ్వడంతో సామాన్య ప్రజానీకం పడరాని పాట్లు పడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో పరిస్థితి అదుపు తప్పుతోంది. మహబూబాబాద్ జిల్లాలో గ్యాస్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. సిలిండర్ల కోసం వినియోగదారులు రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా, సిలిండర్ల కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం తాకిడి చూస్తుంటే నిత్యావసర వస్తువుల కోసం ఎంతటి కటకట ఏర్పడిందో అర్థమవుతోంది.

గ్యాస్ సిలిండర్ల లోడ్ వస్తుందంటే చాలు.. మార్గమధ్యలోనే జనం వాటిని లూటీ చేస్తారేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్యాస్ వాహనాలకు పోలీసులు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో, పోలీస్ ఎస్కార్ట్ మధ్య సిలిండర్ల వాహనాలను గ్రామాలకు తరలిస్తుండటం గమనార్హం. గురువారం పెద్దముప్పారం గ్రామంలో చోటుచేసుకున్న దృశ్యాలు చూసి స్థానికులు విస్తుపోయారు. ఈ గ్రామంలో సుమారు 170 మంది లబ్ధిదారులు సిలిండర్ల కోసం బుక్ చేసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద వందల సంఖ్యలో జనం గుమిగూడటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాస్ గోడౌన్ నుండి 4 ట్రాలీ ఆటోలలో సిలిండర్లను తరలించగా వాటికి ముందు ఒక పోలీస్ వాహనం, వెనుక మరో వాహనం ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఏకంగా ఇద్దరు ఎస్సైల పర్యవేక్షణలో ఈ పంపిణీ ప్రక్రియ సాగింది. చివరికి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పోలీసుల సమక్షంలో వినియోగదారులకు సిలిండర్లు అందజేయడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రజల ఆవేదన

“గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాలంటే యుద్ధానికి వెళ్తున్నట్టు ఉంది. గంటల తరబడి ఎండలో నిలబడితే గానీ గ్యాస్ దొరకడం లేదు. పెట్రోల్, డీజిల్ కష్టాలు చాలవన్నట్టు ఇప్పుడు వంటింటి గ్యాస్ కోసం కూడా పోలీసుల కాపలా అవసరమైంది” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు, యంత్రాంగం స్పందించి ఈ సరఫరాను త్వరగా చక్కదిద్దకపోతే, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us