
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ జిమ్ ఫిట్నెస్ ట్రైనర్‌పై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని కల్ట్ ఫిట్ జిమ్‌లో పనిచేస్తున్న మల్లెల రవి ఈ దారుణానికి ఒడిగట్టు పేర్కొన్నారు. 2025 జూన్ 5న బాధితురాలు జిమ్‌లో చేరిన సమయంలో మైనర్‌గా ఉందని ఆమె తల్లి పేర్కొన్నారు. అప్పటి నుంచి ట్రైనర్ ఆమెతో అసభ్యకరంగా మాట్లాడటంతోపాటు వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. అనుమతి లేకుండా శరీరంలోని ప్రైవేటు భాగాలను తాకాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
2026 సెప్టెంబరులో మరో మహిళ ఫోన్ చేసి, నిందితుడు తనతోపాటు పలువురు మహిళలను మోసం చేసినట్లు వెల్లడించిందని బాధితురాలి తల్లి తెలిపారు. ఈ పరిణామాల తర్వాత తన కుమార్తె తీవ్ర మానసిక ఆందోళనకు గురై చికిత్స పొందుతోందని, ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు ట్రైనర్‌పై గతంలోనూ రెండు ఫిర్యాదులు, కేసులు ఉన్నట్లు జిమ్ యాజమాన్యం తెలిపిందని తల్లి ఆరోపించారు. నిందితుడికి సంబంధించిన వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచి సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు BNSలోని పలు సెక్షన్లతోపాటు పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..