Telangana: ఊర్లోని పిల్లలంతా సర్కార్ బడికే.. ప్రవేట్ స్కూల్‌కి పోతే జరిమానా..

వేల రూపాయల ఫీజులతో ప్రైవేట్ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచింది. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు గ్రామంలోకి రాకూడదని, ప్రభుత్వ బడులనే బలోపేతం చేయాలని నిర్ణయించారు.

Telangana: ఊర్లోని పిల్లలంతా సర్కార్ బడికే.. ప్రవేట్ స్కూల్‌కి పోతే జరిమానా..
Babapur Government School

Edited By:

Updated on: Jun 06, 2026 | 12:35 PM

అప్పోసొప్పో చేసి.. వేల రూపాయలు చెల్లించి తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు. పేద మధ్య తరగతి అన్న తేడా లేకుండా ప్రైవేట్ పాఠశాలలకే జై కొడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపితేనే తమ పిల్లల బతుకు మారుతుందని.. ప్రభుత్వ పాఠశాలలకు పంపితే పిల్లలకు చదువు రాదని.. క్రమశిక్షణ కోల్పోతారని అపనమ్మకంతో ప్రైవేట్ పాఠశాలలకు క్యూ కడుతున్నారు. కానీ అన్ని ఊర్లు ఒక లెక్క.. మా ఊరిలో మాత్రం మరో లెక్క అంటున్నారు నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామస్తులు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ బడులే ముద్దు అంటూ పిలుపునిస్తున్నారు. ఊరు ఊరంతా ఒక్కటయి తీర్మానం సైతం చేసుకున్నారు. తమ గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాల బస్సులు కూడా రావద్దని.. కాదు‌ కూడదని ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తే జరిమానా తప్పదంటూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకే జై కొట్టి ఔరా అనిపించుకుంటున్న ఆ ఊరు గురించి తెలుసుకోవాలంటూ నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం బాబాపూర్‌కు వెళ్లాల్సిందే.

ప్రభుత్వ బడులు బాగు పడాలంటే స్థానికులే ముందుకు రావాలని నిరూపించారు నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని బాబాపూర్ గ్రామస్తులు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పంపిస్తామని ప్రైవేట్ బడులకు రాంరాం చెపుతున్నామంటూ ప్రతిజ్ఞ చేశారు. గ్రామ సర్పంచ్ పడిగెల లక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు సుజాత ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్కార్ కల్పిస్తున్న వసతులు.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్‌లో బోధన.. మధ్యాహ్న భోజనం.. ఆట స్థలం..ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలపై బాబాపూర్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు సర్పంచ్ పడిగెల లక్ష్మి. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపిస్తే జరిమానా తప్పదని.. వేల రూపాయల ఫీజులు చెల్లించి ఆర్థిక భారాన్ని మోయ వద్దని స్థానికులను కోరారు సర్పంచ్. సర్పంచ్ మాటకు జై కొట్టిన గ్రామస్తులు ఊరు ఊరంతా ఒక్కటై సర్కార్ బడులకే మా పిల్లలను పంపిస్తామని ప్రైవేట్ పాఠశాలకు పంపమని ప్రమాణం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us