అగ్గిపెట్టెకు, బీడికట్టకు ధర ఉన్నప్పుడు పంటకు ధర ఉండొద్దా.. రైతులను అభివృద్ధి చేస్తే అవినీతి అంటకడతారా..

దేశంలో రైతువేదికలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రతి చోటా ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ..

  • K Sammaiah
  • Publish Date - 5:32 pm, Fri, 22 January 21
అగ్గిపెట్టెకు, బీడికట్టకు ధర ఉన్నప్పుడు పంటకు ధర ఉండొద్దా.. రైతులను అభివృద్ధి చేస్తే అవినీతి అంటకడతారా..

దేశంలో రైతువేదికలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రతి చోటా ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ కేవలం రైతులను దృష్టిలో పెట్టుకుని వారికోసమే రైతువేదికలను సృష్టించింది కేసీఆర్ మాత్రమే అన్నారు. 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగం బాగుంటే సమాజం అంతా బాగుంటుందని చెప్పారు. కరీంనగర్‌ జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో రైతువేదికను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.

అగ్గిపెట్టెకు, బీడికట్టకు కూడా ప్రపంచంలో ధర ఉంటుంది. కానీ ఆరుగాలం కష్టపడ్డ రైతుపంటకు మాత్రం మార్కెట్ లో ధర ఎందుకుండకూడదని మంత్రి ప్రశ్నించారు. తన పంటకు రైతు తాను ధర నిర్ణయించుకోవాలంటే రైతులు సంఘటితం కావాలి అన్నది కేసీఆర్ ఆలోచన అని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకే రైతువేదికలను నిర్మించి రైతులను ఒకచోటికి తెస్తున్నారని వివరించారు. వ్యవసాయం బలోపేతం కోసం రైతుబంధు, రైతుభీమా, ఉచిత విద్యుత్తు ఇచ్చి, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం. ఏడాదికి రెండుసార్లు భూసారపరీక్షలు చేసి రికార్డులు రైతులకు అందజేస్తున్నాం. వ్యవసాయంలో మెళకువలు, పంటల విధానం, పంటల సాగుపై రైతువేదికల ద్వారా రైతులకు విజ్ఞానం అందిస్తామని చెప్పారు.

కరోనాతో ప్రపంచమే లాక్ డౌన్ అయింది. తెలంగాణకు రావాల్సిన రూ.50 వేల కోట్ల రాబడులు ఆగిపోయాయి. ఆదాయం లేకున్నా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాలు ఆపి
వానాకాలం, యాసంగిలో రూ.15 వేల కోట్లు రైతుబంధు కింద అందజేశామని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్రం ఒక రైతుకు కేవలం రూ.6 వేలు అదీ మూడు విడతలలో ఇస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తున్నదని నిరంజన్‌రెడ్డి వివరించారు. వ్యవసాయరంగం బలపడాలి, దేశంలో అత్యధిక శాతం ఆధారపడ్డ ప్రజలు బాగుపడాలి అన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.

రాబోయే రోజులలో రైతునే పెళ్లి చేసుకుంటానని చెప్పే రోజులు రావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. అన్నంపెట్టే రైతు శాసించే స్థితిలో ఉండాలి కానీ, యాచించే దుస్థితిలో ఉండొద్దనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగంలో ఇన్ని పథకాలు లేవని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. కఠోరదీక్షతో కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేసుకున్నామని చెప్పారు. రైతులకు ఇన్నేళ్లు ఏ ప్రభుత్వమూ మేలు చేయలేదు. ఇంత కాలానికి రైతులను అభివృద్ది చేస్తుంటే అవినీతిని అంటగడతారా అంటూ ప్రతి పక్షాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు.