
నవ మాసాలు మోసిన తల్లి కన్నపేగును వదులుకుంది. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసింది. ఈ అమానవీయ ఘటన కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టి అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రించాల్సిన ఓ ఆడ శిశువు చెట్ల పొదల్లోకి చేరింది. కనీసం రక్తపు మరకలు కూడా ఆరకముందే బిడ్డను భారంగా భావించి పసికందును పందులు, కుక్కలు సంచరించే ప్రాంతంలో వదిలివెళ్లిన అమానవీయ ఘటన కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగజ్‌నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో పత్తి చేనులో ఓ పసికందును గుడ్డలో కట్టి పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. శిశువు ఏడుపు విన్న స్థానికులు చుట్టూ వెతికిచూశారు. పత్తి చేనులో ముల్లపొదల్లో ఓ గుడ్డలో రక్తపు మడుగులో అల్లాడుతున్న శిశువును గుర్తించిన స్థానికులు పసికందును కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు పసికందును ఆస్పత్రికి తరలించారు. పసికందును పరీక్షించిన వైద్యులు శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. పసికందు అప్పుడే పుట్టిన ఆడశిశువు అని.. మూడు నుండి నాలుగు గంటలు మాత్రమే అయిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును బాలసదన్ అదికారులకు అప్పగించారు. అయితే పసికందును అంతా దారుణంగా చెట్ల పొదల్లో పడవేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది.. ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు అన్నది తేలాల్సి ఉంది. ఆడశిశివు కావడంతోనే వదిలేసుకున్నారా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా.. అసలు నిందితులు ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.