
ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు స్థానికంగా ఉన్న బొప్పాయి తోటలో వదిలేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాపను రక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీ.ఆర్. బంజర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, సమీపంలోని బొప్పాయి తోటలో నుంచి ఏడుపు శబ్దాలు వినిపించాయి. దీంతో అనుమానం వచ్చిన వారు తోటలోకి వెళ్లి చూడగా, అక్కడ అప్పుడే పుట్టిన ఓ మగ శిశువు కనిపించాడు.
శిశువును చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామ ఆశా కార్యకర్తల సహాయంతో శిశువును సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం జిల్లా ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని శిశువు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం చిన్నారిని ఇంక్యుబేటర్లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, శిశువును దత్తత తీసుకునేందుకు కొందరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, శిశువు తల్లిదండ్రులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వారు ఎవరనేది గుర్తించిన తర్వాత, చట్టపరమైన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే, అప్పుడే పుట్టిన శిశువును గ్రామ శివారులోని బొప్పాయి తోటలో ఎవరు వదిలి వెళ్లారు? ఈ ఘటనకు గల కారణాలేమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.