నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం 10 రోజుల్లో ఇలా ముగిసింది..

నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన మొగుదాల పెంటయ్య (90), ఆయన భార్య సాలమ్మ (85) 70 ఏళ్లపాటు కలిసి జీవించారు. అనారోగ్యంతో ఈ నెల 6న పెంటయ్య మరణించగా, ఆయన అంత్యక్రియల అనంతరం పది రోజులకే సాలమ్మ కూడా కన్నుమూశారు. ఒకే ఇంట్లో వరుసగా చోటుచేసుకున్న ఈ రెండు మరణాలతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఏడు దశాబ్దాలుగా ఒకరికొకరు తోడుగా జీవించిన ఈ దంపతుల కథ గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం 10 రోజుల్లో ఇలా ముగిసింది..
Nalgonda Couple Death

Edited By:

Updated on: Oct 16, 2026 | 9:46 AM

వందేళ్ల జీవితంలో ఒకరికి ఒకరు తోడుగా ఏడడుగులు నడిచారు.. కష్టసుఖాల్లో కలిసిమెలిసి జీవించారు. ఒకరి చూపులో మరొకరి ప్రపంచాన్ని చూసుకున్నారు. వయసు మీద పడినా ఆ ప్రేమలో ఏమాత్రం మార్పు రాలేదు. జీవిత చరమాంకంలోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. అనారోగ్యం భర్తను కబళించడంతో.. ఏడు దశాబ్దాలుగా తనతో కలిసి నడిచిన సహచరుడు దూరమయ్యాడనే బాధను తట్టుకోలేక భార్య.. భర్త చితి చల్లారకముందే ప్రాణాలు విడిచింది. పెళ్లితో మొదలైన ప్రయాణం.. మరణంలోనూ విడదీయలేని బంధంగా మారింది. సినిమాల్లో కనిపించే ప్రేమకథను తలపిస్తున్న ఈ హృదయ విదారక ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

70 ఏళ్లపాటు కలిసి జీవించారు

నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలకు చెందిన మొగుదాల పెంటయ్య, సాలమ్మలు ఏడు దశాబ్దాల క్రితం ఏడడుగులు నడిచి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. అందరూ కూడా కూతుళ్లే. ఉన్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ పిల్లలందరినీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. ఈ దంపతులు 70 ఏళ్లపాటు కలిసి జీవించారు. వయసు పెరిగినా.. మనసులో ప్రేమ తగ్గలేదు. కాలం మారినా.. కలిసి నడిచిన బాట మారలేదు. వృద్ధాప్యంలోనూ సంతోషంలోనూ, కష్టంలోనూ ఒకరికొకరు తోడుగా నిలిచారు. అనారోగ్యం బారిన పడిన పెంటయ్య (90) ఈనెల ఆరో తేదీన కన్ను మూశారు. భర్త మరణంతో సాలమ్మ (85) తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

భర్త మరణించిన పది రోజులకే

పెంటయ్య మరణంతో కుటుంబం ఇప్పటికే దుఃఖంలో ఉండగా.. ఆయన దశదినకర్మ కార్యక్రమానికి బంధువులు, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో మంచంపై ఉన్న సాలమ్మ విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. భర్త మరణించిన పది రోజులకే భార్య కూడా కన్నుమూయడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. ఒకే ఇంట్లో వరుసగా రెండు మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. వృద్ధ దంపతుల మధ్య ఉన్న అనుబంధం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

కాలం మనుషులను దూరం చేయొచ్చు.. కానీ కలిసి గడిపిన జీవితపు జ్ఞాపకాలను చెరిపేయలేదు. ప్రేమకు వయసుతో పనిలేదని.. అనుబంధాలకు లెక్కలు ఉండవని చాటిచెప్పిన ఈ వృద్ధ దంపతుల జీవితం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. బంధాల విలువను, జీవిత భాగస్వామి తోడులోని గొప్పతనాన్ని మరోసారి గుర్తుచేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us