Telangana: అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో ముస్లిం వ్యక్తి..

మతం ఏదైతేనేం.. మనసు పవిత్రంగా ఉంటే భక్తి ఒక్కటే అని నిరూపించాడు ఆ వ్యక్తి.. కులమతాల మధ్య గోడలు పెరుగుతున్న నేటి కాలంలో, మానవత్వమే నా మతం అంటూ హనుమాన్ దీక్ష చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రాణాపాయం నుంచి కాపాడిన ఆ అంజన్నపై నమ్మకంతో, కాషాయ వస్త్రాలు ధరించి కఠిన దీక్షతో కొండగట్టు స్వామి మొక్కు తీర్చుకున్నాడు.

Telangana: అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో ముస్లిం వ్యక్తి..
Muslim Youth Takes Hanuman Deeksha

Edited By:

Updated on: Apr 03, 2026 | 6:59 PM

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన ముస్లిం వ్యక్తి మహమ్మద్ యూసఫ్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. హిందూ సంప్రదాయంలో భాగమైన హనుమాన్ దీక్షను 11 రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తూ ఆయన అందరి దృష్టిని ఆకర్షించాడు. మతభేదాలు పక్కనపెట్టి భక్తి, విశ్వాసంతో ముందుకెళ్లిన యూసఫ్ ప్రశంసలు అందుకుంటున్నారు. హనుమాన్ దీక్షలో భాగంగా పాటించాల్సిన ప్రతి నియమాన్ని యూసఫ్ కచ్చితంగా పాటించాడు. ప్రత్యేకమైన ఆహార నియమాలు, నిత్య పూజలు, ఉపవాసం, మాలధారణ వంటి ఆచారాలను ఆయన అత్యంత క్రమశిక్షణతో నిర్వహించాడు. ఉదయం, సాయంత్రం పూజలు చేయడం, నియమిత జీవన విధానాన్ని పాటించడం ద్వారా తన భక్తిని చాటుకున్నాడు. గ్రామంలోని హిందూ భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు..

హనుమాన్ జయంతి సందర్భంగా యూసఫ్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి మాల విరమణ చేశాడు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు ఆయనను ఆశ్చర్యంతో చూసి అభినందించారు. మత భేదాలకు అతీతంగా భక్తిని ప్రదర్శించారు. గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదంలో యూసఫ్ ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డాడు. దైవమే తనకు అండగా నిలిచిందని భావించాడు. ముఖ్యంగా శ్రీరాముని ఆశీస్సులతోనే తాను బ్రతికానని నమ్మిన యూసఫ్, ఆ కృతజ్ఞతగా హనుమాన్ దీక్ష చేపట్టినట్లు తెలిపాడు. ఆ అనుభవం తనలో ఆధ్యాత్మికతను పెంచిందని తెలిపాడు.

మనిషి మనసు పవిత్రంగా ఉంటే ఏ మతాన్నైనా గౌరవించాలి. మతం వేరు అయినా మనసు ఒకటే.. అని యూసఫ్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. అన్ని మతాలు సమానమేనని, పరస్పర గౌరవం ఉండాలని ఆయన ఇచ్చిన సందేశం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. యూసఫ్ చేపట్టిన దీక్ష గ్రామంలో చర్చనీయాంశమైంది. హిందూ, ముస్లిం భేదాలు లేకుండా అందరూ ఆయనను అభినందిస్తున్నారు. యువతలో మతసామరస్యాన్ని పెంపొందించేలా ఆయన చేసిన ఈ కార్యం ఆదర్శంగా నిలిచింది. పలువురు పెద్దలు, యువకులు యూసఫ్‌ను అభినందిస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మతపరమైన విభేదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో యూసఫ్ చర్య సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది

Follow Us