హైదరాబాద్: శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే 040-29555500 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రమంతటా వ్యాపించడంతో నెమ్మదిగా వాతావరణం చల్లబడుతోంది. నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కొంత భాగం వ్యాపించాయి. ఆదివారం నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115.6 నుంచి 204.4 మి.మీ.ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. మరో ఏడు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.