
ముక్కుపచ్చలారని వయసులోనే తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన ఓ చిన్నారి కథ విషాదాంతమైంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి ఆరాధ్య, తెల్లారే సరికి చెరువులో శవమై తేలింది. ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మామిడిగుండాల పంచాయతీ పరిధిలోని రాజ్య తండాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజ్య తండా గ్రామానికి చెందిన మాలోతు రవి అనే వ్యక్తి తన కుమార్తెకు ఓ యువకుడితో పెళ్లి జరిపించాడు. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. అయితే, పాప మూడేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోవడంతో.. రవి తన కుమార్తెకు రెండో వివాహం జరిపించాడు. పెళ్లి తర్వాత ఆమె తన కూతురైన ఆరాధ్యను తండ్రి వద్దే ఉంచి, రెండో భర్తతో కాపురానికి అత్తింటికి వెళ్లిపోయింది. దీంతో ఐదేళ్ల వయసున్న ఆరాధ్యను తాతయ్య రవి తన దగ్గరే ఉంచుకుని బాగోగులు చూసుకుంటున్నాడు.
ఇటీవల రవి తన మనవరాలు ఆరాధ్యను తమ్ముడి ఇంట్లో వదిలి, భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చేసరికి చిన్నారి కనిపించకుండా పోయింది. ఊరంతా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందిన రవి, స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది.
తెల్లవారుజామున మరోసారి బాలిక కోసం గాలింపు చేపట్టగా, గ్రామ సమీపంలోని చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. చెరువులో విగతజీవిగా తేలిన చిన్నారిని చూసి తాతయ్య రవి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు, చిన్నారి మరణానికి గల పూర్తి కారణాలను రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.