తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో నాటకం!

మెదక్ జిల్లాలో కుటుంబ కలహాలు హత్యకు దారితీశాయి. మద్యం సేవించి తరచూ గొడవపడుతున్నాడన్న కోపంతో భార్య, కుమారుడు కలిసి ఇంటి యజమానిని హత్య చేశారు. అనంతరం అది ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చనిపోయినట్లు చూపించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో నాటకం!
Husband Murder

Edited By:

Updated on: Apr 22, 2026 | 9:03 PM

మెదక్ జిల్లాలో కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీశాయి. మద్యం సేవించి తరచూ గొడవ పడుతున్నాడన్న కోపంతో.. కట్టుకున్న భార్య, కన్న కొడుకుతో కలిసి ఇంటి యజమానిని దారుణంగా హత్యచేశారు. తర్వాత ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా పరిధిలోని పొడ్చన్‌పల్లి తండాకు చెందిన మాలోత్ కిషన్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కిషన్‌కు ఉన్న మద్యపానం అలవాటు ఆ ఇంట్లో నిత్యం చిచ్చు పెడుతోంది. కిషన్ ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి భార్య మాలి, కొడుకు వినోద్‌తో గొడవకు దిగేవాడు.

సోమవారం రాత్రి కూడా కిషన్ మద్యం మత్తులో ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన భార్యా కొడుకులు.. ఇక కిషన్ ఉంటే తమకు ప్రశాంతత ఉండదని భావించారు. తండ్రిని కింద పడేసి విచక్షణారహితంగా దాడి చేశారు. తల్లి కాళ్లు గట్టిగా పట్టుకోగా.. కొడుకు వినోద్ తండ్రి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా కిషన్ మృతదేహాన్ని ఇంటి ముందున్న నీటి తొట్టిలో పడేశారు. ఉదయం నీటి తొట్టిలో కిషన్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా.. కిషన్ మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి కిషన్ భార్య మాలిని, కొడుకు వినోద్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. గొడవ కారణంగా తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. మృతుడి కుమార్తె లీలావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మహమ్మారి ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా.. ఒక కుటుంబాన్ని జైలు పాలు చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us