MLC Election: తెలంగాణలో మోగనున్న మరో ఎన్నికల నగారా.. పక్కా ఫ్లానింగ్‌లో ప్రధాన పార్టీలు..!

| Edited By: Balaraju Goud

Oct 20, 2024 | 1:26 PM

కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి.. దీంతో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నాయి.

MLC Election: తెలంగాణలో మోగనున్న మరో ఎన్నికల నగారా.. పక్కా ఫ్లానింగ్‌లో ప్రధాన పార్టీలు..!
Brs Bjp Congress
Follow us on

లోక్‌సభ ఎన్నికల తరువాత.. తెలంగాణలో మరో ఎన్నిక రానుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే.. ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. గెలిచే అభ్యర్థులపై దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకంగా మారనున్నాయి. పార్టీలతో పాటు.. నలుగురు నేతలకు మాత్రం ఈ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ నలుగురు నేతలు.. తమ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరా.. ఆ.. నలుగురు నేతలు.. ఇప్పుడు తెలుసుకుందాం..!

కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఫిబ్రవరి చివరి వారంలో జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఎన్నిక జరుగుతుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి.

ఈ నేపథ్యంలోనే నలుగురు కీలక నేతలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.. ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉండే మంత్రి శ్రీధర్ బాబు, ఎప్పుడు దూకుడుగా ఉండి ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యే మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు ఈ ఎన్నికలు చాలా కీలకం. ఈ నలుగురు కూడా రాష్ట్రంలో కీలక నేతలుగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు.

ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎన్నికలు జరుగుతుండటంతో ఇక్కడ మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. అధికార పార్టీ ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించింది. అదే విధంగా బీఆర్ఎస్, బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ రాష్ట్రంలో 8 సీట్లు గెలిస్తే.. ఈ జిల్లాల నుంచే 7 చోట్ల విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం.. బీజేపీదే పైచేయి సాధించింది. కరీంనగర్, మెదక్, నిజమాబాద్, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను కమలం పార్టీ గెల్చుకోగా, పెద్దపల్లి స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

ఇప్పుడు మారిన పరిస్థితిల్లో మరోసారి త్రిముఖ పోటీ ఏర్పడింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ సానుభూతి పరులను ఓటరుగా నమోదు చేయాలని కోరుతున్నారు. ఈ నాలుగు జిల్లాలో ఇప్పటి నుంచే బలమైన నేత కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే.. వాటిని బయటకు లీక్ చేయడం లేదు అధికారపార్టీ.

ఇదిలావుంటే, బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును సాధించలేకపోయింది. గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గట్టి పట్టు ఉండేది. తాజాగా మరోసారి సత్తా చాటేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్యపై ఫోకస్ చేశారు. వివిధ ఉద్యోగాల భర్తీలపై ఆందోళన నిర్వహిస్తున్నారు. కేటిఆర్ ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గం నుంచీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నాలుగు జిల్లాలపై పట్టు ఉన్న నేత కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అంతేకాకుండా సర్వే టీమ్ ను కూడా రంగంలోకి దింపారు అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీలను గట్టిగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపుస్తున్నారు. ఈ ఎన్నికల ఆధారంగా పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. దీంతో కేటిఆర్.. ప్రతి అంశాన్ని లోతుగా చర్చిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు. మరింత దూకుడు పెంచాలని కోరుతున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు కేటీఆర్.

ఇక, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ గట్టి పట్టుంది. అసెంబ్లీతోపాటు, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాను చాటింది. బీజేపీలో కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్‌కి సైతం ఈ ఎన్నికలు సవాలుగా మారిపోయాయి.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చినా.. ఇప్పుడు పార్టీ ముందుకు వెళ్లాలంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా
కీలకం. ఇప్పటికే ఓటరు నమోదుపై దృష్టి పెట్టారు. జిల్లాలా వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. ఆర్ఎస్ఎస్, ఎబీవీపీ నేతలతో కూడా సమావేశమవుతున్నారు. వారి ఆలోచనలు కూడా పరిగణలోకి సుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సరైన ఫలితం రాకపోతే.. రాబోవు ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారట.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి.. దీంతో ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నాయి. పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. మరింత దూకుడుగా వెళ్లాలని సూచిస్తున్నారు.

 మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి