Telangana: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. హెల్మెట్ లేకంటే ఆ గ్రామల్లోకి నో ఎంట్రీ! ఎక్కడంటే?

సాధారణంగా హెల్మెట్‌ లేకుండా రోడ్లపై రావద్దు అంటారు. కానీ ఇక్కడ మాత్రం హెల్మెట్ లేకుండా తమ ఊర్లోకి ఎంట్రీ కూడా లేదని అంటంటోంది ఓ గ్రామం. నెత్తిన హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై గ్రామంలోకి ఎవరూ రాకూడదని ఆ గ్రామస్తులు తీర్మానం చేశారు. గ్రామ నిబంధనలను పక్కన బెట్టి ఎవరైనా ఊర్లోకి వస్తే వారు జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంతకీ ఈ విచిత్ర ఉద్యమం ఎక్కడ జరుగుతుంది! వాళ్లలో ఈ స్ఫూర్తి నింపింది ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. హెల్మెట్ లేకంటే ఆ గ్రామల్లోకి నో ఎంట్రీ! ఎక్కడంటే?
Mahabubabad Helmet Rule

Edited By:

Updated on: Apr 01, 2026 | 1:37 PM

నెత్తిన హెల్మెట్ లేకపోయినా.. సీట్ బెల్ట్ పెట్టుకోక పోయినా.. రాంగ్ రూట్‌లో వెళ్ళినా.. ట్రాఫిక్ రూల్స్ పాటించక పోయినా పోలీసులు నడిరోడ్డుపై ఆపేస్తారు. బరాబర్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జరిమానా వేస్తారు. వాహదారులు ఎదురు మాట్లాడితే పోలీస్ మార్క్ చూపెడతారు. అయితే మార్పు అనేది ఎక్కడో ఓచోట మొదలు కావాలి.. ప్రజల్లో హెల్మెట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు లభిస్తాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ చేసిన ప్రయత్నం ఊహించని మార్పుకు కారణంగా మారింది.

ఈ జిల్లా ఎస్పీ శబరీష్ నేతృత్వంలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువతకు అవగాహన సదస్సులు నిర్వహించారు. కచ్చితంగా ఈ మూడు పాటిస్తే ప్రమాదాలు, దొంగతనాలు, మరణాలు, గొడవలు నివారించవచ్చని అవగాహన కల్పించారు. వాటిలో మొదటిది ప్రతిఒక్కరూ బాధ్యత గా హెల్మెట్ ధరించాలి.. ప్రతి గ్రామం పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలి.. గ్రామాల దరిదాపుల్లోకి గంజాయి రాకుండా కట్టడి చేయగలిగితే ఊర్లని ప్రశాంతంగా ఉంటాయి.. ప్రమాదాలు దరిచేరమని అవగాహన కల్పించారు.

జిల్లా ఎస్పీ పిలుపుమేరకు స్థానిక పోలీసులు కూడా గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని గ్రామాలు సరికొత్త తరహాలో ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసుకొని గ్రామ పొలిమేరల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా తమ గ్రామాల్లోకి రావొద్దని హెచ్చరిస్తున్నారు. గ్రామ పొలిమేరల్లో కొందరు యువకులు హెల్మెట్ లేకుండా గ్రామాల్లోకి వస్తున్నా వారిని అడ్డుకుంటున్నారు.

ముఖ్యంగా బయ్యారం మండలంలోని వెంకటాపురం, బాలాజీపేట గ్రామాల్లో ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేని వాహనదారులను గ్రామ పొలిమేరల్లోనే అడ్డుకుంటున్నారు. గ్రామస్తులు స్వయం శక్తితో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుండి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఈ మూడు నియమాలు తూచా తప్పకుండా ఆచరించేలా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రమంతటా ఇదేవిధంగా గ్రామాలు స్పందిస్తే నేరాలు నియంత్రించవచ్చు, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చనేది పోలీసుల భావన.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us