Vanama Raghava Arrested: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్ రావు ఏ-2 నిందితుడిగా ఉన్నాడు. బాధిత కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ కారణమని.. రామకృష్ణ సూసైడ్ నోట్ రాయడంతో పాటు వీడియో కూడా రికార్డు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే.. మొదట హైదరాబాద్లో గురువారం రాఘవను అరెస్టు చేశారని వార్తలు వచ్చాయి. అనంతరం రాఘవ అరెస్టు కాలేదంటూ పోలీసులు ప్రకటించడంతో.. విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. అయితే.. వనమా రాఘవను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మండలం మందలపల్లి, ఏపీ సరిహద్దు ప్రాంతం చింతలపూడి మధ్య రాఘవను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ కోసం రాఘవను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. రాఘవతోపాటు డ్రైవర్, అతని సహకరించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా.. రాఘవను ఏ1 గా ప్రకటించాలని.. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు నిన్న కొత్తగూడెం బంద్ కూడా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి రాఘవను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కూడా ప్రకటించింది.
ఇదిలాఉంటే.. గురువారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగ లేఖ రాశారు. చట్టానికి, విచారణకు రాఘవ సహకరిస్తాడని తెలిపారు. తన కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటానని లేఖలో స్పష్టంచేశారు. పార్టీకి నియోజకవర్గానికి రాఘవేంద్రను దూరం పెడుతాననని.. నిర్దోషిగా అయ్యేంతవరకు రాజకీయాల్లో తలదూర్చడని చెప్పారు.
Also Read: