
రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక నాయకుడు మరో నాయకుడిని విమర్శించడం, ఆరోపణలు చేయడం తరచూ కనిపిస్తుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ మాటలే వివాదాలుగా మారుతాయి. చివరకు విమర్శలు చేసిన నాయకులే బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తాజాగా కేటీఆర్‌కు క్షమాపణ చెప్పడంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నాయకులు తమ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సందర్భాలున్నాయి.
2024 అక్టోబర్‌లో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ వివాదాన్ని సృష్టించాయి. కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో సమంత, నాగచైతన్య విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో నాగార్జున పరువు నష్టం కేసు వేశారు. అనంతరం సురేఖ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ వాటిని ఉపసంహరించుకున్నారు. గురువారం కేటీఆర్‌కు కూడా క్షమాపణ చెబుతూ గత వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ అంశం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సడెన్‌గా సారీ చెప్పడం వెనకున్న కారణమేంటీ..? అనే ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి తలెత్తుతున్నాయి. అయితే వ్యక్తిగత అంశాలను రాజకీయ విమర్శల్లోకి తీసుకొస్తే వివాదం ఎంత దూరం వెళ్తుందో ఈ ఘటన చూపించింది.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కూడా గతంలో బహిరంగంగా క్షమాపణ చెప్పారు. 2022లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించడంపై విమర్శలు చేస్తూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో చిరంజీవి అభిమానులు, జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం నారాయణ తన మాటలు హద్దు దాటాయని అంగీకరించి చిరంజీవికి, ఆయన అభిమానులకు క్షమాపణ చెప్పారు.
తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆద్లూరి లక్ష్మణ్ మధ్య వ్యాఖ్యల వివాదం కూడా చర్చనీయాంశమైంది. పొన్నం వ్యాఖ్యలపై ఆడ్లూరి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుంది. ఇద్దరి మధ్య చర్చల అనంతరం పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పారనే వార్తలు వచ్చాయి. పార్టీ పెద్దల జోక్యంతో వివాదాన్ని ముగించే ప్రయత్నం జరిగింది.
2018లో వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన తర్వాత భావోద్వేగంతో టీడీపీ నాయకులపై వ్యాఖ్యలు చేశానని ఆయన వివరించారు. తన మాటలు తప్పని భావించి, వాటి వల్ల బాధపడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. రాజకీయ వేడిలో చేసిన వ్యాఖ్యలను తర్వాత వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఎలా వస్తుందో ఈ ఘటన చూపించింది.
కె. అచ్చెన్నాయుడు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రివిలేజ్ కమిటీ ముందు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పారనే వార్తలు వచ్చాయి. శాసనసభలో మాట్లాడే మాటలకు కూడా నియమాలుంటాయి. సభాపతిపై చేసిన వ్యాఖ్యలకు సభా నిబంధనల ప్రకారం సమాధానం చెప్పాల్సి రావచ్చు.
2025లో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్‌ను కించపరిచారనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన పార్థసారథి, సర్పంచ్‌ను అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని ప్రకటించారు.
2006లో కాంగ్రెస్ నాయకులు లగడపాటి రాజగోపాల్, సత్యనారాయణ మధ్య వ్యాఖ్యల వివాదం తలెత్తింది. పార్టీ నాయకత్వం జోక్యంతో ఇద్దరూ క్షమాపణలు చెప్పుకుని వివాదాన్ని ముగించుకునే ప్రయత్నం చేశారు. పార్టీలోని విభేదాలు బహిరంగంగా పెరిగితే పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలగవచ్చు. అందుకే కొన్ని సందర్భాల్లో పార్టీ పెద్దలు మధ్యవర్తిత్వం చేస్తారు.
తెలుగు రాష్ట్రాలకే ఈ పరిస్థితి పరిమితం కాలేదు. జాతీయ రాజకీయాల్లోనూ పలువురు నాయకులు క్షమాపణలు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ 2018లో నితిన్ గడ్కరీకి లేఖ రాసి, నిర్ధారణ కాని ఆరోపణలు చేసినందుకు విచారం వ్యక్తం చేశారు. అదే ఏడాది బిక్రమ్ సింగ్ మజీథియాపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుంటూ క్షమాపణ చెప్పారు. అరుణ్ జైట్లీపై చేసిన ఆరోపణల విషయంలోనూ కేజ్రీవాల్, మరికొందరు ఆప్ నాయకులు క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ కూడా నితిన్ గడ్కరీపై చేసిన వ్యాఖ్యల విషయంలో 2014లో క్షమాపణ చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సాకేత్ గోఖలే, మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పూరిపై చేసిన ఆరోపణల విషయంలో న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు క్షమాపణ చెప్పాలని, నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిన ఘటన కూడా ఉంది.
నాయకులు క్షమాపణ చెప్పడానికి ఒకే కారణం ఉండదు. కొందరు నోరు జారామని అంగీకరిస్తారు. మరికొందరు ఎదుటివారు బాధపడ్డారని చెబుతారు. ఇంకొందరు పార్టీ పెద్దల జోక్యంతో వివాదాన్ని ముగిస్తారు. పరువు నష్టం కేసులు ఎదురైనప్పుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, క్షమాపణ చెప్పడం న్యాయపరమైన పరిష్కారంలో భాగమవుతుంది. అయితే క్షమాపణ చెప్పారంటే ఆరోపణలు నిజమని లేదా అబద్ధమని తేలిపోయినట్టు కాదు. రాజకీయాల్లో మాటకు విలువ ఉంది. ఆధారాలతో విమర్శించడం ప్రజాస్వామ్యంలో భాగం. కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మాటకు మైకు దొరికితే చాలు. తప్పుకు క్షమాపణే దారి అనేది నిజం.
కొండవీటి శివనాగరాజు
డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.