
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొండా సురేఖ తన గత వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 2024 అక్టోబర్ 2న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీని విమర్శించే ప్రయత్నంలోనే ఆ వ్యాఖ్యలు చేశానని, కేటీఆర్ కుటుంబం పట్ల తనకు ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నారు.
తొందరపడి నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. గతంలో తాను చేసిన నిరాధార వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
కొండా సురేఖ పోస్ట్ చూడండి..
అసలేం జరిగింది?
సుమారు రెండేళ్ల క్రితం కేటీఆర్‌ను విమర్శిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో ఆమె మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా న్యాయస్థానాల వరకు వెళ్లింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్‌తో పాటు ఓ సినీ కుటుంబం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు తమ ప్రతిష్ఠకు భంగం కలిగించాయంటూ పరువు నష్టం దావా వేసింది. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది.
రెండేళ్ల తర్వాత స్పందన
గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా కొండా సురేఖ స్పందించడంతో ఈ అంశం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో తొందరపడి నిరాధార వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె తన తాజా ప్రకటనలో అంగీకరించారు. తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ కుటుంబం బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. దీంతో గతంలో తీవ్ర వివాదానికి దారితీసిన ఈ అంశం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.