
ఖమ్మం: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో విషాదాన్ని నింపింది. తన పిల్లలను మంచిగా చూసుకోవాలంటూ లేఖ రాసి సాగర్ కాలువలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
అనారోగ్యం.. ఆర్థిక ఇబ్బందులతో సతమతం
వివరాల్లోకి వెళ్తే.. కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన దొడ్డపునేని వెంకటేశ్వరరావు (50) కోండ్రుపాడు గ్రామంలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన వెంకటేశ్వరరావు సూసైడ్ నోట్ రాసి సాగర్ కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన పిల్లలను మంచిగా చూసుకోవాలని, తాను తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక దూరమవుతున్నానని లేఖలో పేర్కొన్నారు.
10గంటల పాటు గాలింపు.. చివరకు మృతదేహం లభ్యం!
సాగర్ కాలువలో వెంకటేశ్వరరావు గల్లంతైన విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు పది గంటల పాటు శ్రమించి, ఘటనాస్థలానికి కిలోమీటరు దూరంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం ముఖ్యం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..