
జగిత్యాల జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. నిమజ్జనాల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సారి కూడా గతేడాది మాదిరి వినాయక నిమజ్జన వేడుకల బందోబస్తులో ట్రాన్స్ జెండర్లను భాగస్వాములుగా చేశారు పోలీసులు. ఈ సారి ఏకంగా 17 మంది ట్రాన్స్‌జెండర్లు నిమజ్జన వేడుకల బందోబస్తు విధుల్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ నిమజ్జన కేంద్రాలకు భక్తులు భారీ సంఖ్యలో గణనాథులు తరలిరావడంతో ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పోలీసులతో కలిసి చురుగ్గా విధులు నిర్వర్తించారు. జనసమూహాలను నియంత్రించడంతో పాటు, ట్రాఫిక్‌ను అదుపు చేయడం, అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో వారు పోలీసులకు సహాయం అందించారు.
గతేడాది కూడా నిమజ్జన వేడుకల బందోబస్తు విధుల్లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు అంకితభావంతో, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వర్తించినట్టు పోలీసులు తెలిపారు. వారు అందించిన సేవలు వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడడంతో ఎంతో సహాయపడ్డాయని తెలిపారు. వారి సేవకు గాను వారికి అనేక ప్రసంశలు కూడా దక్కాయని తెలిపారు.
ఇదిలా ఉండగా తమపై పూర్తి నమ్మకం ఉంచి, భద్రతా ఏర్పాట్లలో పాల్గొనే అవకాశం కల్పించిన ట్రాన్స్‌జెండర్ సిబ్బంది సైతం జగిత్యాల జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ తమకు అప్పగించిన గౌరవం, బాధ్యత తమలో ఎంతగానో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాల్లో మరింత నిబద్ధతతో సేవలందించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు వారు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.