
ప్రజల అత్యాశను పెట్టుబడిగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీతో పోలిస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించి.. పెట్టుబడిగా పెట్టిన సొమ్ము రెండేళ్లలో రెట్టింపు అవుతుందని ప్రచారం చేశారు. ఐటీసీ క్రిప్టో కరెన్సీ పేరుతో పెట్టుబడిదారులను ఆకర్షించి, వారి పేర్లతో ఐడీలు సృష్టించి, ఆన్‌లైన్ ఖాతాల్లో క్రిప్టో కరెన్సీ జమ అయినట్లు చూపించేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ పథకంలో నాన్ వర్కింగ్ ప్లాన్, వర్కింగ్ ప్లాన్ అంటూ రెండు విధానాలను ప్రవేశపెట్టారు. నాన్ వర్కింగ్ ప్లాన్‌లో రెండేళ్లకు పెట్టుబడి రెట్టింపు అవుతుందని ఆశ చూపగా.. వర్కింగ్ ప్లాన్‌లో కొత్త సభ్యులను చేర్చితే వారి పెట్టుబడులపై 25 శాతం వరకు కమీషన్ వస్తుందని ప్రచారం చేశారు. దీంతో కొందరు తమకు తెలిసినవారిని, బంధువులను, స్నేహితులను కూడా ఈ పథకంలో చేర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకరి పెట్టుబడితో మరొకరిని ఆకర్షిస్తూ సభ్యుల సంఖ్యను పెంచుకోవడమే ఈ వ్యవస్థలో కీలకంగా మారింది.
వెబ్‌సైట్ నుంచి జూమ్ మీటింగ్‌ల వరకు..
ప్రజల్లో విశ్వసనీయత పెంచుకునేందుకు ముఠా పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. cticlub.org పేరుతో వెబ్‌సైట్ రూపొందించి, అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పెట్టుబడి పథకాలను వివరించేవారు. ఆన్‌లైన్ ఎక్స్ఛేంజ్‌లు, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు మార్గాల ద్వారా డబ్బులు పంపించాలని సూచించేవారు.
కేవలం ఆన్‌లైన్ ప్రచారానికే పరిమితం కాకుండా.. వివిధ ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జీల్లో సమావేశాలు నిర్వహించారు. జూమ్ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పథకం వివరాలను ప్రచారం చేశారు. డైరీలు, క్యాలెండర్లు పంపిణీ చేస్తూ సంస్థపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. ఇలా సాంకేతికతను, ప్రత్యక్ష సమావేశాలను ఉపయోగించుకుని పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు విచారణలో వెల్లడైంది.
డబ్బులు చెల్లించేదాకా ఒక కథ.. తిరిగి అడిగితే మరో కథ!
పెట్టుబడిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత వాటిని తిరిగి చెల్లించే విషయంలో నిందితులు కాలయాపన చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని అడిగితే మరికొన్ని రోజుల్లో చెల్లిస్తామని చెబుతూ తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. చివరకు వెబ్‌సైట్ మూసివేయడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. తాము పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
ఈ వ్యవహారంలో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన జువ్వక నర్సింలు ఫిర్యాదు చేయగా.. విచార చేపట్టిన పోలీసులకు సంచలనవిషయాలు వెలుగు చూశాయి. ఐటీసీ గ్లోబల్ ప్రతినిధులమంటూ నమ్మించి 2023లో ITC 58708 ఐడీ ద్వారా రూ.7.50 లక్షలు పెట్టుబడిగా పెట్టినట్లు తేలింది. పలుమార్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా నిందితులు చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దీంతో ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు క్రైమ్ నంబర్ 17/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
2023లో ఈ ముఠాకు చెందిన ఏజెంట్లు ఆదిలాబాద్‌కు వచ్చి ద్వారక హోటల్‌లో సమావేశాలు నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుల్లో వెల్లడైన పెట్టుబడి మొత్తాల ప్రకారం జువ్వక నర్సింలు రూ.7.50 లక్షలు, చిక్కి గంగాధర్ రూ.7.50 లక్షలు, అడ్డీ కాంతారెడ్డి రూ.6.21 లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు. వీరి పెట్టుబడుల మొత్తం రూ.21.21 లక్షలు కాగా. మరోవైపు, ఆదిలాబాద్ వన్‌టౌన్ పరిధిలో ఐదుగురు బాధితులు సుమారు రూ.30 లక్షలు నష్టపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నంకు చెందిన పొలమారశెట్టి రత్నరాజు ఐటీసీ గ్లోబల్ వ్యవస్థాపకుడిగా, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దొండపాటి లక్ష్మణరావు అలియాస్ లాజరస్ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు సంస్థ ప్రతినిధులు, వరంగల్‌కు చెందిన ఇద్దరు ఏజెంట్ల పాత్రపైనా విచారణ కొనసాగుతోంది.
దర్యాప్తులో భాగంగా జహీరాబాద్, రాజమండ్రికి సంబంధించిన ఆస్తులతో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో చేసిన పెట్టుబడుల వసూళ్లు, బాధితుల సంఖ్య, మోసానికి గురైన మొత్తం నగదుపై ఆరా తీస్తున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మొత్తం రూ.10 కోట్లకు పైగా మోసం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.సైబర్ ఆర్థిక మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని, సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.