ఒకటి కాదు, రెండు కాదు.. చూడండి ఎన్ని ఉన్నాయో.. సత్తుపల్లి అటవీ రేంజ్‌లో

సత్తుపల్లి అటవీ రేంజ్ పరిధిలో అరుదైన గౌర్ జాతి అడవి దున్నలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. వీటి ఉనికిని నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు, గ్రామస్థులను అప్రమత్తం చేశారు. గౌర్‌ల సంచారం వల్ల కలిగే ప్రమాదాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

ఒకటి కాదు, రెండు కాదు.. చూడండి ఎన్ని ఉన్నాయో.. సత్తుపల్లి అటవీ రేంజ్‌లో
Gaur Sighting

Edited By:

Updated on: Apr 08, 2026 | 1:11 PM

సత్తుపల్లి అటవీ రేంజ్ పరిధిలో అరుదైన గౌర్ జాతి అడవి దున్నలు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో వీటిని పలుమార్లు చూసినట్లు స్థానికులు కూడా తెలిపారు. గౌర్‌లను ఇండియన్ బైసన్‌లు అని కూడా అంటారు. ఇవి సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసించే భారీ వన్యప్రాణులు. అడవి దున్నలు సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివసించే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. గౌర్‌ల సంచారం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని, ఒకవేళ అవి ఎదురైతే వాటిని రెచ్చగొట్టకుండా దూరంగా ఉండాలని సూచించారు. రైతులు తమ పశువులను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అరుదైన గౌర్‌ల సంచారం వన్యప్రాణి సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అటవీ శాఖ గౌర్‌ల కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తూ, మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణలను నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గౌర్ బరువు సాధారణంగా 600 నుంచి 1000 కిలోల వరకు ఉంటుంది. భుజాల ఎత్తు 6 అడుగుల వరకు ఉంటుంది. గాఢమైన గోధుమ లేదా నలుపు రంగులో ఉండి.. కాళ్ల వద్ద తెల్లటి “సాక్స్” లాగా కనిపించే గుర్తులు ఉంటాయి మగ గౌర్‌లు ఆడ గౌర్‌ల కంటే చాలా పెద్దగా, బలంగా ఉంటాయి. ఇవి సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఇష్టపడతాయి. చిన్న గుంపులుగా సంచరిస్తాయి. ఉదయం, సాయంత్రం సమయంలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటాయి. సాధారణంగా గౌర్‌లు శాంత స్వభావం కలిగినవే.. కానీ ప్రేరేపిస్తే లేదా భయపెడితే చాలా ఆగ్రహంగా మారి దాడి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తమ పిల్లలున్నప్పుడు మరింత అగ్రెసివ్‌గా ఉంటాయి. ఇవి పూర్తిగా శాకాహారులు. గడ్డి, ఆకులు, చిన్న మొక్కలు తింటాయి. గౌర్‌లు ప్రస్తుతం అపాయ స్థితిలో ఉన్న జాతి. అడవుల నాశనం, వేట కారణంగా సంఖ్య తగ్గుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి పశువులలో ఒకటైన గౌర్‌లు సత్తుపల్లి అటవీ ప్రాంతంలో కనిపించడం వన్యప్రాణి వైవిధ్యానికి సూచికగా అధికారులు భావిస్తున్నారు.

Also Read: ఈ ఒక్క పని చేస్తే పిండి పురుగు అంతా మాడి మసైపోద్ది అంతే.. 

Follow Us