తిరస్కరణ నుంచి చరిత్ర వరకు.. వైద్య రంగంలో చరిత్ర సృష్టించిన హైదరాబాద్ రూత్ జాన్ పాల్!

కుటుంబం తిరస్కరించినా, ఆకలి బాధలు వెంటాడినా, కోర్టు పోరాటాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడి గెలిచారు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో పీజీ (MD) పూర్తి చేసి భారతదేశంలోనే మొదటి ట్రాన్స్‌జెండర్ పీజీ డాక్టర్‌గా చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రూత్, చిన్నతనంలో తండ్రిని కోల్పోయి, తీవ్ర ఆర్థిక ఇబ్బందులను దాటుకుంటూ చదువుకున్నారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ అడ్మిషన్ల కోసం తెలంగాణ హైకోర్టు తలుపులు తట్టి న్యాయపోరాటం చేశారు. హైదరాబాద్ ESIC మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

తిరస్కరణ నుంచి చరిత్ర వరకు.. వైద్య రంగంలో చరిత్ర సృష్టించిన హైదరాబాద్ రూత్ జాన్ పాల్!
Transgender Doctor India

Updated on: Oct 29, 2026 | 1:03 PM

సాధించాలనే సంకల్పం, కొండంత ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అవరోధాలైనా దాటవచ్చని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్. సమాజంలో ఎన్నో అవమానాలు, కుటుంబ తిరస్కరణ, తీవ్ర ఆకలి బాధలు, చివరకు అడ్మిషన్ కోసం న్యాయపోరాటం చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు. తెలంగాణ ఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీ నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఎండి (MD) డిగ్రీ పూర్తి చేసి, భారతదేశంలోనే వైద్యవిద్యలో పీజీ పూర్తి చేసిన తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా రికార్డులకెక్కారు.

కష్టాలతో సాగిన చిన్నతనం:

తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన రూత్ జాన్ పాల్ ప్రయాణం ఏమాత్రం సులువుగా సాగలేదు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూత్ చదువులో ఎప్పుడూ ముందే ఉండేవారు. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాస్ టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత మెరిట్ ఆధారంగా ఎంబీబీఎస్ సీటు సాధించారు.

థర్డ్ ఈయర్‌లో బయటపడిన నిజం.. కుటుంబ తిరస్కరణ:

ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో తాను ఒక ట్రాన్స్‌జెండర్ అనే విషయాన్ని రూత్ బయటకు వెల్లడించారు. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరస్కరించారు. ఉండటానికి నీడ, తినడానికి తిండి లేక, ఉపాధి కోసం అనేక ఆస్పత్రుల తలుపులు తట్టినా వివక్ష ఎదురైంది. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ హైకోర్టులో చారిత్రాత్మక పోరాటం:

ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ కోర్సులో చేరాలనుకున్న రూత్‌కు మళ్లీ రూల్స్ రూపంలో అడ్డంకులు ఎదురయ్యాయి. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేదా రిజర్వేషన్లు లేకపోవడంతో ఆమె పీజీ కౌన్సెలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై అధైర్యపడకుండా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు రెండేళ్ల పాటు సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, ట్రాన్స్‌జెండర్ కేటగిరీ కింద ఆమెను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోర్టు ఆదేశించింది.

సమాజానికి ఆదర్శంగా:

కోర్టు ఉత్తర్వులతో హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ESIC మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీ మెడిసిన్ సీటు సాధించి, ఇటీవలే పీజీ పరీక్షల్లో విజయం సాధించారు. ఈ విజయం నా ఒక్కదానిదే కాదు, నాలాంటి అనేకమంది ట్రాన్స్‌జెండర్ సమాజానికి లభించిన గొప్ప గౌరవం అని రూత్ ఆనందం వ్యక్తం చేశారు. వివక్షలను ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరిన రూత్ జాన్ పాల్ ప్రయాణం కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us