
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రజలకు మరింత సులభతరమైన ప్రయాణ సౌకర్యం అందించేందుకు మెట్రోకు అనుసంధానంగా పాడ్ కార్లను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రణాళికలు మరింత ముమ్మరం అయ్యాయి. పాడ్ కార్లను నడిపేందుకు డిపోల కోసం స్థలాలను గుర్తించారు. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 185 ఎకరాల భూమి అవసరమని గుర్తించగా.. కూకట్ పల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో డిపోల కోసం ఇప్పటికే స్థలాల సేకరణ పూర్తయింది. ఇక మిగతా ప్రాంతాల్లో డిపోల కోసం భూముల పరిశీలన చేపడుతున్నారు. కొన్ని భూములు ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఉండటంతో వాటిని సేకరించేందుకు ఆయా సంస్థలకు హైదరాబాద్ మెట్రో అధికారులు లేఖలు రాయనున్నారు. విడతల వారీగా పాడ్ కార్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. ఇప్పటికే మెట్రోలలో రద్దీని తగ్గించేందుకు త్వరలో కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు సిద్దమవుతున్నాయి. ఇందుకోసం త్వరలో కొత్త కోచ్‌లను కొనుగోలు చేయనున్నారు. దీంతో పాటు పాడ్ కార్లు అందుబాటులోకి వస్తే మెరుగైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
పాడ్ కార్ల ప్రాజెక్టుకు సంబంధింి కూకట్ పల్లి నుంచి తొలి దశ ప్రారంభం కానుండగా.. ఇక్కడ పెద్ద డిపో ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ డిపో కోసం 104.8 ఎకరాలు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇక రెండో విడత కారిడార్‌కు సంబంధించి పీపుల్స్ ప్లాజా వద్ద 0.9 ఎకరాలు, బతుకమ్మ ఘాట్ దవ్ద 0.8 ఎకరాలు, రాణిగంజ్ డిపో వద్ద 1.5 ఎకరాలు, సంజీవయ్య పార్క్ వద్ద 0.7 ఎకరాలు అవసరం అవుతాయని గుర్తించారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలు గురించి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను వీటి కోసం వినియోగించనున్నారు. పాడ్ కార్ల ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తే నగరంలో ప్రజా రవాణా మరింత సులువు కానుంది. తక్కువ సమయంలో ప్రధాన ప్రాంతాలకు చేరుకోవచ్చు. మెట్రో స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లు, ప్రధాన కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాల నుంచి లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుంది.
-కూకట్ పల్లి నుంచి రాయదుర్గం వరకు 7.62 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు
-రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నాలెడ్జ్ సిటీ వరకు 12.83 కిలోమీటర్ల మరో మార్గం ఉంటుంది
– ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిధిలో 14.01 కిలోమీటర్ల మేర పాడ్ కార్ల మార్గం ఉంటుంది
-కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, దుర్గం చెరువు, రాయదుర్గం, విప్రో సర్కిల్, బయోడైవర్సిటీ పార్క్, నానక్ రాంగూడ, ఇందిరానగర్, రాడిన్సన్ జంక్షన్, అమెరికా కాన్సులేట్ వద్ద పాడ్ కార్ల స్టేషన్లు ఉంటాయి
-ఒక పాడ్ కారులో ఐదుగురు వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ విధానంలో ఒక వాహనంలో 25 మంది వరకు ప్రయాణించవచ్చు