ORRపై లగ్జరీ కారు నడిపిన బాలుడు.. సీన్ కట్‌చేస్తే.. తండ్రికి ఊహించని షాక్.. ఇదిగో వీడియో

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తన కొడుకుతో కార్ డ్రైవింగ్ చేయించిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పోలీసుల దృష్టికి చేరడంతో ఓఆర్ఆర్‌పై మైనర్‌తో డ్రైవింగ్ చేయించినందుకు కాను అతనిపై ఎమ్‌వీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ORRపై లగ్జరీ కారు నడిపిన బాలుడు.. సీన్ కట్‌చేస్తే.. తండ్రికి ఊహించని షాక్.. ఇదిగో వీడియో
Hyderabad Orr Minor Driving

Edited By:

Updated on: Jun 19, 2026 | 11:57 AM

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై (ఓఆర్ఆర్) అర్ధరాత్రి వేళ లగ్జరీ కారును 11 ఏళ్ల బాలుడు నడిపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టి బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. టోలిచౌకికి చెందిన అబ్దుల్ హాది ఇటీవల ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో శంషాబాద్–గచ్చిబౌలి ఓఆర్ఆర్ మార్గంలో తన 11 ఏళ్ల కుమారుడితో కారును నడిపించినట్లు గుర్తించారు.

అదే మార్గంలో వెళ్తున్న మరో వాహనదారుడు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ట్రాఫిక్ పోలీసులను ‘ఎక్స్’ వేదికగా ట్యాగ్ చేశారు. దీంతో ఈ ఘటనపై స్పందించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వీడియో ఆధారంగా కారు యజమానిని గుర్తించి విచారణ చేపట్టారు. విచారణలో వాహనాన్ని నడిపింది మైనర్ బాలుడేనని నిర్ధారణ అయింది. దీంతో బాలుడి తండ్రి అబ్దుల్ హాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని, మైనర్‌తో వాహనం నడిపించినందుకు సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

ఇదిగో పోలీసుల పోస్ట్‌, అబ్బాయి కారు నడిపిన వీడియో

వాహనదారులకు పోలీసుల సూచనలు

ఈ సందర్భంగా వాహనదారులకు పోలీసులకు కొన్ని సూచనలు కూడా చేశారు. మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారం మైనర్ డ్రైవింగ్‌ నేరమని.. 16 ఏళ్ల లోపు పిల్లలు ఎలాంటి వాహనాన్ని నడపడానికి వీలు లేదని తెలిపారు. వీరికి గేర్లు లేని, 50cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటర్లు నడపడానికి మాత్రమే లర్నింగ్ లైసెన్స్ లభిస్తుందన్నారు. ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా మైనర్ డ్రైవింగ్ చేస్తే దానికి తల్లిదండ్రులు లేదా ఆ వాహన యజమానిదే పూర్తి బాధ్యత అవుతుందని.. వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తారని తెలిపారు. అలాగే వాహనం కూడా సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us