
హైదరాబాద్ మెట్రో సేవలు మరోసారి విదేశీయుల ప్రశంసలు అందుకున్నాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించిన అనంతరం తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మెట్రో పరిశుభ్రత, సౌకర్యాలు, నిర్వహణపై ప్రశంసలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ మెట్రో ఇన్ హైదరాబాద్ పేరుతో వీడియోను పోస్ట్ చేసిన ఇషాక్ ప్యాటర్సన్, మెట్రో స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలను చూపించారు. రైలు స్టేషన్‌కు చేరుకున్న వెంటనే ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను ఇప్పటివరకు ప్రయాణించిన మెట్రో వ్యవస్థల్లో ఇది నాకు అత్యంత ఇష్టమైన వాటిలో ఒకటి అని వ్యాఖ్యానించారు.
స్టేషన్‌లో ప్రయాణికులు వేగంగా మెట్రో ఎక్కడానికి వెళ్తుండటాన్ని గమనించిన ఆయన, రైళ్లు ఎంత వ్యవధిలో వస్తాయో ఆసక్తిగా అడిగారు. మొదట 20 నిమిషాలకు ఒకసారి వస్తాయేమోనని భావించినప్పటికీ, తర్వాత మెట్రోలో ఎక్కి ప్రయాణం ప్రారంభించారు. రద్దీ సమయాల్లో ప్రయాణించినప్పటికీ కొంతసేపటికి తనకు సీటు దొరికిందని చెప్పారు. మెట్రో బోగీల్లో ప్రయాణికుల సంఖ్య, లోపల ఏర్పాటు చేసిన ప్రకటనలు తన దృష్టిని ఆకర్షించాయని పేర్కొన్నారు. అయితే మెట్రో కోచ్‌ల పరిశుభ్రతే తనను ఎక్కువగా ఆకట్టుకుందని ఇషాక్ ప్యాటర్సన్ తెలిపారు.
పోస్ట్ చూడండి..
రైలు చాలా శుభ్రంగా ఉంది. లోపల మంచి వాసన వస్తోంది. ఎక్కడా చెత్త కనిపించలేదు” అని ప్రశంసించారు. ప్రయాణ అనుభవం ఎంతో సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, హైదరాబాద్ వాసులు పెద్ద ఎత్తున స్పందించారు. అన్నా… హైదరాబాద్ మెట్రో రద్దీ సమయాల్లో ప్రతి రెండు నిమిషాలకోసారి వస్తుంది” అని ఒకరు కామెంట్ చేశారు. “మా నగరాన్ని ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాం. ఇక్కడి ఫుడ్, పర్యాటక ప్రదేశాలు కూడా సందర్శించండి” అని మరో నెటిజన్ సూచించారు.
ఇది న్యూయార్క్ మెట్రో కంటే మెరుగ్గా ఉంది” అని ఇంకొకరు వ్యాఖ్యానించగా, మా హైదరాబాద్ మెట్రో మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది అంటూ పలువురు స్పందించారు. ప్రపంచంలోని పలు నగరాలను సందర్శిస్తున్న విదేశీ వ్లాగర్లు హైదరాబాద్ మెట్రో సేవలను ప్రశంసించడం నగర ప్రజా రవాణా వ్యవస్థ నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తోందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.