Hyderabad: మణికొండలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు – అడ్డంగా బుక్కయ్యారు

తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో (TGANB), నార్సింగి పోలీసులతో కలిసి మణికొండలోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఒక నైజీరియన్ జాతీయుడిని మరియు ఇద్దరు స్థానిక డ్రగ్స్ వ్యాపారులను అరెస్టు చేసింది. పోలీసులు వారి నుంచి 107 గ్రాముల కొకైన్, 25 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ వీధి విలువ రూ 30 లక్షలు ఉంటుందని అంచనా.

Hyderabad: మణికొండలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు - అడ్డంగా బుక్కయ్యారు
Manikonda Drug Bust

Updated on: Jun 24, 2025 | 7:52 AM

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అల్కాపూరి టౌన్‌ షిప్‌లో టీ న్యాబ్, నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 30 లక్షల విలువైన STCP పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఒక విదేశీయుడితో పాటు.. ఇద్దరు లోకల్ డ్రగ్ పెడ్లర్స్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. మణికొండలో ఓ లగ్జరీ ఫ్లాట్ రెంట్‌కు తీసుకుని.. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు. విదేశీయుడు విస్డం ఒనేకా, మణికొండకి చెందిన గోపిశెట్టి రాజేష్, పశ్చిమ గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజును అదుపులోకి తీసుకుని.. వీరి వెనుక ఎవరున్నారో ప్రశ్నిస్తున్నారు.

విదేశీయుడు నకిలీ పాస్ పోర్ట్‌తో హైదరాబాద్‌కు వచ్చినట్లు గుర్తించారు. మొయినాబాద్ పీఎస్ పరిధిలోని అజీజ్ నగర్‌లో ఉన్న ఫాం హౌజ్‌లో మే 29న నిర్వహించిన రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించింది ఈ ముఠా. మే 31న మంగళగిరిలో ఫణి రాజ్ అనే వ్యక్తికి 15 గ్రాముల కొకైన్ ఇచ్చినట్లు పోలీసులకు చెప్పారు. ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొన్న ఫణిరాజ్, పవిత్ర రెడ్డి, సతీష్, సదా శివ, సుధీర్, భానులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..