Khairatabad Ganesh Nimajjanam Live: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణేశుడు

హుస్సేన్‌ సాగర్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఖైరతాబాద్‌లోని గణేష్ మండపం నుంచి బయల్దేరిన భారీ గణనాథుడు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రెయిన్ నెంబర్ 4వద్దకు చేరుకోగా.. అక్కడే నిమజ్జనం పూర్తయింది. ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే సమయంలో ఆ ప్రాంతం మొత్తం బై బై గణేశా నినాదాలతో మార్మోగింది.

Khairatabad Ganesh Nimajjanam Live: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణేశుడు
Ganesh Nimajjanam 2026

Edited By:

Updated on: Sep 25, 2026 | 6:35 PM

భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జన మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 25న జరుగుతున్న భారీ శోభాయాత్రకు లక్షలాది మంది భక్తులు నగరానికి తరలివస్తున్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతితో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో నిమజ్జన వేదికలు, క్రేన్లు, బారికేడ్లు, లైటింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం మొబైల్‌ టాయిలెట్లు, తాగునీటి కేంద్రాలను అందుబాటులో ఉంచారు. నిమజ్జన ప్రక్రియ వేగంగా, సురక్షితంగా పూర్తయ్యేలా అదనపు క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

భారీగా తరలివచ్చే భక్తుల కోసం పోలీసులు విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా 20 వేల మందికి పైగా పోలీసులను మోహరించగా.. 10 వేలకు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగనుంది. కీలక ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ బృందాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ బలగాలను కూడా అందుబాటులో ఉంచారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో సేవలను పొడిగించారు. మరోవైపు ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 10 గంటల వరకు ప్రధాన మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రజలు వీలైనంత వరకు మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ వంటి ప్రజా రవాణాను వినియోగించాలని అధికారులు సూచించారు.

మొత్తంగా.. భక్తుల భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Sep 2026 05:45 PM (IST)

    గణేష్ నిమజ్జన వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

    అంబర్‌పేట్‌లో గణనాథులను దర్శించుకున్న కిషన్‌రెడ్డి
    వినాయకుడి ఆశీస్సులతో ప్రజలకష్టాలు, విఘ్నాలుతొలగాలి : కిషన్ రెడ్డి
    గణనాథులను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది-కిషన్‌ రెడ్డి
  • 25 Sep 2026 05:10 PM (IST)

    నిమజ్జనంపై మంత్రి పొన్నం, డీజీపీ ఏరియల్‌ సర్వే

    నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది-మంత్రి పొన్నం
    నిమజ్జనం వేగవంతం చేయాలి-మంత్రి పొన్నం
    నిర్వాహకులు, భక్తులు సహకరించాలి-పొన్నం
    MJ మార్కెట్, చార్మినార్ దగ్గర ట్రాఫిక్ సమస్య ఉంది
    ట్రాఫిక్ క్లియర్‌కు తక్షణ చర్యలు తీసుకోవాలి-పొన్నం
  • 25 Sep 2026 04:50 PM (IST)

    హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జానాలు

    హెస్సెన్ సాగర్ వైపు తరలివస్తున్న గణేష్ విగ్రహాలు

    ఎన్టీఆర్ మార్గ్‌లో భారీగా నిలిచిన గణేష్ విగ్రహాలు

    గణేష్ విగ్రహాలు, భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ మార్గ్

    హైదరాబాద్‌లో కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనం

  • 25 Sep 2026 04:48 PM (IST)

    HYD: కొనసాగుతున్న బాలాపూర్‌ గణేషుడి శోభాయాత్ర

    తెలంగాణ తల్లి ఫైఓవర్‌కు చేరుకున్న బాలాపూర్ గణేషుడు
    శోభాయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు
  • 25 Sep 2026 02:43 PM (IST)

    ముగిసిన ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం!

    ముగిసిన ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం

    గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణేషుడు

     

  • 25 Sep 2026 02:11 PM (IST)

    గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహా గణేష్

    గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ బడా గణేష్

    హుస్సెన్‌ సాగర్‌లో ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం

    గణనాథుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

    భక్తులతో కిక్కిరిసిన హుస్సెన్ సాగర్ పరిసర ప్రాంతాలు

    ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రెయిన్ నెం.5వద్ద ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం

     

  • 25 Sep 2026 01:54 PM (IST)

    కలశ పూజతో నిమజ్జనానికి శ్రీకారం

    ట్యాంక్‌బండ్‌ క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. కలశ పూజతో నిమజ్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మహాగణపతికి చివరి పూజలు కొనసాగుతున్నాయి. భారీగా తరలివచ్చిన భక్తులు గణనాథుడిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అధికారులు నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల గణపతి నామస్మరణలతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు మార్మోగుతున్నాయి. మరికాసేపట్లో మహాగణపతిని గంగమ్మ ఒడికి చేర్చనున్నారు.

  • 25 Sep 2026 01:17 PM (IST)

    చార్మినార్‌ వద్ద హై అలర్ట్‌.. భారీగా పోలీసుల మోహరింపు..

    హైదరాబాద్‌ పాతబస్తీలో గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. చార్మినార్‌ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో హారతి కార్యక్రమం ముగియగా.. సమీపంలోని మక్కామసీదులో శుక్రవారం ప్రార్థనలు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో బాలాపూర్‌ గణేషుడు చార్మినార్‌ పరిసరాల్లోకి చేరుకోనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాలాపూర్‌ గణేషుడి వెంట పాతబస్తీకి చెందిన గణనాథులు కూడా నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు భారీగా తరలివస్తుండటంతో ట్రాఫిక్‌, భద్రతపై పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా సాగుతున్న గణపతి శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • 25 Sep 2026 12:45 PM (IST)

    భక్తిశ్రద్ధలతో, కోలాహలం నడుమ గంగమ్మ ఒడికి గణపయ్య!

    బొజ్జ గణపయ్యను భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా ఊరేగిస్తూ గంగమ్మ ఒడికి సాగనంపే నిమజ్జన వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ‘మళ్లీ త్వరగా రావయ్యా’ అంటూ భక్తులు గణపయ్యకు వీడ్కోలు పలుకుతున్నారు. తెలుగు నేలపై జరిగే ఈ నిమజ్జన వేడుకలు మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు గణపతి రూపాన్ని తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ మురిసిపోతున్నారు. డప్పుల మోతలు, భక్తుల నినాదాలు, రంగురంగుల అలంకరణల మధ్య సాగుతున్న ఈ వేడుకలు నగరాలు, గ్రామాల్లో పండుగ వాతావరణాన్ని మరింత పెంచుతున్నాయి.

  • 25 Sep 2026 12:15 PM (IST)

    క్రేన్‌ నంబర్‌ 4 వద్దకు ఖైరతాబాద్‌ మహాగణపతి.. !

    హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన ఘట్టం కీలక దశకు చేరుకుంది. 69 అడుగుల బడా గణపతి క్రేన్‌ నంబర్‌ 4 వరకు చేరుకుంది. వెడ్డింగ్‌ పనులు పూర్తయిన అనంతరం మహాగణపతిని ట్యాంక్‌బండ్‌లో గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయనున్నారు. ఈ మహా నిమజ్జన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. నిమజ్జన ప్రాంతం మొత్తం నిఘా నేత్రంలో కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నిమజ్జన ప్రక్రియ సురక్షితంగా, సజావుగా పూర్తయ్యేలా క్రేన్లు, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మహాగణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు ట్యాంక్‌బండ్‌ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

  • 25 Sep 2026 12:08 PM (IST)

    బాలాపూర్‌ గణేషుడి శోభాయాత్రకు పోటెత్తిన భక్తులు..

    భాగ్యనగరంలో బాలాపూర్‌ గణేషుడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. గణేష్‌ నిమజ్జనాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బాలాపూర్‌ హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర గణేశ్‌చౌక్‌ ఎడమ వైపు నుంచి డైమండ్‌ హోటల్‌కు చేరుకుంది. అక్కడి నుంచి మైసమ్మకట్ట, చాంద్రాయణగుట్ట మీదుగా చార్మినార్‌కు చేరుతుంది. అనంతరం అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, లిబర్టీ వై జంక్షన్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకోనుంది. భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు రోప్‌ పార్టీని కూడా రంగంలోకి దించారు. మార్గమధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

  • 25 Sep 2026 12:04 PM (IST)

    వైభవోపేతంగా శోభాయాత్ర..

    భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర సచివాలయం వరకు చేరుకుంది. మహాగణపతిని దర్శించుకునేందుకు మార్గమధ్యంలో భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక వాహనంపై మహాగణపతిని తరలిస్తూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

  • 25 Sep 2026 11:39 AM (IST)

    2026లో మరో భారీ రికార్డు

    2026లో జరిగిన బాలాపూర్ లడ్డూ వేలంలో అర్బన్ గ్రూప సంస్థ అధినేత సామ ప్రణీత్‌ రెడ్డి రూ.39 లక్షలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది మరో కొత్త రికార్డు నమోదైంది. అంటే 1994లో రూ.450తో మొదలైన బాలాపూర్‌ లడ్డూ వేలం.. 32 ఏళ్లలో రూ.39 లక్షల స్థాయికి చేరింది. ఈ వేలంలో వచ్చిన మొత్తాన్ని బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సామాజిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ పేర్కొంది.

    1994 – రూ. 450

    2002 – రూ. 1.05 లక్షలు

    2015 – రూ. 10.32 లక్షలు

    2022 – రూ. 24.60 లక్షలు

    2024 – రూ. 30.01 లక్షలు

    2025 – రూ. 35 లక్షలు

    2026 – రూ. 39 లక్షలు.

  • 25 Sep 2026 11:37 AM (IST)

    కరోనా సమయంలో వేలం రద్దు

    2020లో కరోనా మహమ్మారి కారణంగా బాలాపూర్‌ లడ్డూ వేలం నిర్వహించలేదు. ఆ ఏడాది లడ్డూను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. 2021లో రూ.18.90 లక్షలు పలికిన లడ్డూ.. 2022లో ఒక్కసారిగా రూ.24.60 లక్షలకు చేరింది. 2023లో రూ.27 లక్షలు, 2024లో రూ.30.01 లక్షలు పలికింది. 2025లో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌ గౌడ్ రూ.35 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. దీంతో అప్పటి వరకు ఉన్న రికార్డు బద్దలైంది.

  • 25 Sep 2026 11:36 AM (IST)

    రూ.450 నుంచి రూ.39 లక్షలకు!

    1994లో తొలిసారి లడ్డూ వేలం ప్రారంభమైంది. ఆ ఏడాది స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి రూ.450కు లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఏడాది వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వచ్చింది. 2002లో తొలిసారి రూ.1 లక్ష మార్క్‌ను దాటి రూ.1.05 లక్షలు పలికింది. 2007లో రూ.4.15 లక్షలు, 2015లో రూ.10.32 లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలకు చేరుకుంది. తాజాగా 2026లో జరిగిన వేలంలో సామ ప్రణీత్‌ రెడ్డి రూ.39 లక్షలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు.

  • 25 Sep 2026 11:33 AM (IST)

    బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే..!

    హైదరాబాద్‌లోని బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1994లో తొలిసారి లడ్డూ వేలం ప్రారంభమైంది. ఆ ఏడాది స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి రూ.450కు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు, స్థానికులకు పంచడంతో పాటు పొలంలో చల్లగా పంట దిగుబడి పెరిగిందనే అనుభవంతో ఆయన మరుసటి ఏడాది కూడా లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. దీంతో లడ్డూను సొంతం చేసుకుంటే సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయనే నమ్మకం క్రమంగా బలపడింది.

  • 25 Sep 2026 11:21 AM (IST)

    బాలాపూర్‌ లడ్డూ వేలంలో రికార్డు ధర..!

    Sama Praneeth Reddy

    ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. బాలాపూర్‌ ఉత్సవ కమిటీ తరఫున రూ.1,116 ప్రారంభ ధరతో వేలం పాట మొదలైంది. ఈసారి లడ్డూకు భారీగా పోటీ నెలకొనగా.. సామ ప్రణీత్‌ రెడ్డి అత్యధికంగా రూ.39 లక్షలు చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు. దీంతో బాలాపూర్‌ లడ్డూ వేలంలో మరోసారి భారీ ధర నమోదైంది. గతేడాది రూ.35.70 లక్షలు పలికిన లడ్డూ.. ఈసారి రూ.39 లక్షలకు చేరింది. దీంతో గతేడాది ధరతో పోలిస్తే ఈసారి రూ.3.30 లక్షలు అధికంగా పలికింది. వేలం సందర్భంగా బాలాపూర్‌లో సందడి నెలకొంది. వేలం పాటను వీక్షించేందుకు భారీ సంఖ్యలో గ్రామస్థులు, భక్తులు తరలివచ్చారు.

  • 25 Sep 2026 11:14 AM (IST)

    బాలాపూర్‌ లడ్డూ వేలం పాట షురూ..

    ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది.  బాలాపూర్ ఉత్సవ కమిటీ వారి పాట రూ. 1,116 తో వేలం పాట మొదలైంది.

  • 25 Sep 2026 10:47 AM (IST)

    బాలాపూర్‌ లడ్డూ వేలం పాట షురూ..!

    ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. బాలాపూర్‌ గణేష్‌ గ్రామ బొడ్రాయికి చేరుకుంది. లడ్డూ వేలానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేలం పాటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు బాలాపూర్‌ గ్రామస్థులు, భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో వేలం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లడ్డూ కోసం ఈసారి వ్యక్తులతో పాటు కంపెనీలు కూడా పోటీలో నిలిచాయి. మొత్తం తొమ్మిది మంది దరఖాస్తుదారుల్లో ఐదు కంపెనీలు ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. గతేడాది బాలాపూర్‌ లడ్డూ రూ.35.70 లక్షలు పలికింది. ఈసారి ధర మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. వేలం ఎంతకు ముగుస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.

  • 25 Sep 2026 10:20 AM (IST)

    కన్నుల పండుగగా గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర

    హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ శోభాయాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 25 వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు. 10 వేల సీసీ కెమెరాల నిఘాలో శోభాయాత్ర కొనసాగనుంది. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 45 క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. ఈరోజు నుంచి రేపు సాయంత్రం వరకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ను మూసివేశారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.

  • 25 Sep 2026 10:09 AM (IST)

    బాలాపూర్ లడ్డూకు ఈసారి ఫుల్ డిమాండ్‌..!

    బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలానికి సర్వం సిద్ధమైంది. గణేష్‌ ఊరేగింపు కొనసాగుతుండగా మరికొద్దిసేపట్లో గ్రామ బొడ్రాయికి మహాగణపతి చేరుకోనున్నారు. లడ్డూ వేలం పాటను వీక్షించేందుకు గ్రామస్థులు, భక్తులు భారీగా తరలివచ్చారు. 32 ఏళ్లుగా వ్యక్తిగతంగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు, వేలంపాటలో ఈసారి కంపెనీలు కూడా బరిలోకి దిగాయి. మొత్తం తొమ్మిది మంది దరఖాస్తుదారుల్లో ఐదు కంపెనీలు ఉన్నాయి. గతేడాది లడ్డూ రూ.35 లక్షలు పలకగా, ఈసారి రూ.40 లక్షలు దాటొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

  • 25 Sep 2026 09:48 AM (IST)

    ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

    హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్రకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మహాగణపతి దర్శనం కోసం భక్తులతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా మంత్రి దానం నాగేందర్‌ టస్కర్‌ ముందు కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం మహాగణపతి ఎదుట దానం నాగేందర్‌ ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. ఖైరతాబాద్‌ గణేష్‌ యాత్ర ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ భక్తుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేక వాహనంపై మహాగణపతిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర మార్గంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మహాగణపతి శోభాయాత్రను వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

  • 25 Sep 2026 09:37 AM (IST)

    ఇంకా కదలని ఖైరతాబాద్ బడా గణేష్‌

    ఇంకా కదలని ఖైరతాబాద్ బడా గణేష్‌

    మరీ ఆలస్యమవుతున్న శోభయాత్ర

    టస్కర్‌పైకి గణపతిని ఎక్కిస్తున్న నిర్వాహకులు

    మధ్యాహ్నం 2.గంటలలోపు నిమజ్జనం పూర్తి చేస్తామన్న సీపీ సజ్జనార్

    అందుకు భిన్నంగా వాస్తవ పరిస్థితులు

    భక్తులతో కోలాహలంగా ఖైరతాబాద్‌ పరిసరాలు

  • 25 Sep 2026 09:37 AM (IST)

    పాతబస్తీలో భారీ సెక్యూరిటీ

    గణేష్ నిమజ్జనం సందర్భంగా పాతబస్తీలో భారీ సెక్యూరిటీ

    కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన అధికారులు

    పాతబస్తీ నుంచి కొనసాగనున్న బాలాపూర్ గణేష్ శోభాయాత్ర

    శోభాయాత్ర సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా

  • 25 Sep 2026 09:17 AM (IST)

    బాలాపూర్‌లో సందడే సందడి

    బాలాపూర్‌లో సందడే సందడి

    మొదలైన బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర

    భక్తుల కోలాహలంతో సాగర్‌వైపు గణనాథుడు

    భారీ భద్రత మధ్య సాగుతున్న శోభాయాత్ర

    బడా గణపతి చుట్టూ మోహరించిన పోలీసులు

  • 25 Sep 2026 09:14 AM (IST)

    గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లుః మంత్రి

    హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భక్తులు, మండపాల నిర్వాహకులు అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. నిమజ్జన శోభాయాత్రకు దాదాపు 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు. హుస్సేన్‌సాగర్ సహా ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, బోట్లు, రెస్క్యూ బృందాలు, శిక్షణ పొందిన ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. తాగునీరు, వైద్య సేవలు, మొబైల్ టాయిలెట్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మెట్రో, ఆర్టీసీ, రైల్వే శాఖలు అదనపు సేవలు అందిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 112 లేదా 040-21111111కు సంప్రదించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

  • 25 Sep 2026 08:29 AM (IST)

    గణేష్ నిమజ్జనానికి 20 వేల మంది పోలీసులతో బందోబస్తు!

    భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసీ సజ్జనార్ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నగరవ్యాప్తంగా 10 వేల సీసీ కెమెరాలు, ట్యాంక్‌బండ్ చుట్టూ 100 హైరిజ్ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా కొనసాగుతుందని చెప్పారు. బడా గణేష్‌ను 25 లక్షల మంది, బాలాపూర్ గణేష్‌ను 15 లక్షల మంది దర్శించుకున్నట్లు తెలిపారు. నిమజ్జన శోభాయాత్ర మొత్తం 18 కిలోమీటర్ల మేర సాగనుంది. ప్రాంతాన్ని ఐదు సెక్టార్లుగా విభజించారు. మహిళల భద్రత కోసం 26 షీ టీమ్స్ మఫ్టీలో విధులు నిర్వహిస్తాయి. సోషల్ మీడియాపై 24 గంటలూ నిఘా ఉంటుందని, పుకార్లు, అసభ్యకర డ్యాన్స్‌లకు పాల్పడితే చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు. ఇప్పటివరకు 1,172 మంది ఆకతాయిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

  • 25 Sep 2026 08:26 AM (IST)

    గణేష్‌ నిమజ్జనంలో విషాదం.. వాహనం కిందపడి వ్యక్తి మృతి

    హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖైరతాబాద్‌ సమీపంలో నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఓ వ్యక్తి వాహనం కిందపడి మృతి చెందాడు. భారీగా భక్తులు తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

  • 25 Sep 2026 07:51 AM (IST)

    శోభాయాత్రలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి

     

    జగిత్యాల పట్టణంలోని తులసినగర్‌లో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేస్తుండగా ఓ యువకుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలాడు. వెంటనే స్పందించిన పోలీసులు యువకుడికి సీపీఆర్ చేశారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ సకాలంలో అందుబాటులోకి రాకపోవడంతో.. పోలీసుల వాహనంలో యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమంగా ఉండగా.. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడిని జగిత్యాల తులసినగర్‌కు చెందిన తోపారపు జయంత్‌గా గుర్తించారు. నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువకుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

  • 25 Sep 2026 07:41 AM (IST)

    బాలాపూర్ లడ్డూ వేలానికి రంగం సిద్ధం.. బరిలో 8 మంది!

    చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటకు సర్వం సిద్ధమైంది. ఉదయం 9:30 గంటలకు లడ్డూ వేలం ప్రారంభం కానుంది. ఈ ఏడాది వేలంలో పాల్గొనే వారి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. అనంతరం ఉదయం 10 గంటలకు బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ట్యాంక్‌బండ్ వైపు ప్రారంభం కానుంది.

    వేలంలో పాల్గొనే వారిలో అర్బన్ గ్రూప్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, మార్రి రవికిరణ్ రెడ్డి, కందాడ శాలిని వీరేందర్ రెడ్డి, కంచర్ల శివారెడ్డి, లండన్‌కు చెందిన ది సుషీ కో. తరఫున సామ దయానంద్ రెడ్డి, సామ వరానంద్ రెడ్డి, జీఎన్‌ఆర్ డెవలపర్స్ గడ్డం నవీన్ రెడ్డి, పీఎస్‌కే గ్రూప్ శ్రీకాంత్, ఇబ్రహీం ప్రత్యూష్ ఉన్నారు. గతేడాది లడ్డూ రూ.35 లక్షలు పలకగా.. ఈసారి ఎంత ధర పలుకుతుందనేది ఆసక్తిగా మారింది.

  • 25 Sep 2026 07:35 AM (IST)

    బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు 400 మంది పోలీసులతో పహారా!

    బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ తెలిపారు. టీవీ9తో మాట్లాడిన ఆయన.. ప్రత్యేకంగా లడ్డూ వేలం పాట కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భద్రత కోసం సుమారు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. బాలాపూర్ పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రత్యేక పూజల అనంతరం బాలాపూర్ గణేష్‌ను ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక వాహనంపైకి ఎక్కించనున్నారు. అనంతరం గ్రామ ప్రదక్షిణ, శోభాయాత్ర నిర్వహించనున్నారు.

  • 25 Sep 2026 07:25 AM (IST)

    జలమండలి విస్తృత ఏర్పాట్లు

    హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని జలమండలి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. శోభాయాత్రకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది. నిమజ్జనం పూర్తయ్యే వరకు రాబోయే 72 గంటల పాటు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు.

  • 25 Sep 2026 07:07 AM (IST)

    ఖైరతాబాద్ బడా గణేష్‌ నిమజ్జనానికి బ్రేక్.. !

    ఖైరతాబాద్ బడా గణేష్‌ నిమజ్జనం ఈసారి కాస్త ఆలస్యమవుతోంది. క్రేన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శోభాయాత్రకు ఆలస్యం జరిగింది. ప్రస్తుతం నిమజ్జనం కోసం క్రేన్‌లను సిద్ధం చేశారు. మరికాసేపట్లో ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు బడా గణేష్‌ శోభాయాత్ర ప్రారంభం కానుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి శోభాయాత్ర ఆలస్యంగా మొదలవుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాగణపతి సాగర్ తీరానికి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం క్రేన్ నంబర్-4ను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శోభాయాత్ర మార్గంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • 25 Sep 2026 06:52 AM (IST)

    మరికొద్ది సేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట

    బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఉత్సవ సమితి సభ్యులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం బాలాపూర్ గ్రామ ప్రదక్షిణ తర్వాత శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు బాలాపూర్ గణేష్ బొడ్రాయి వద్దకు చేరుకోనున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రతిష్ఠాత్మక లడ్డూ వేలం పాట ప్రారంభం కానుంది. వేలం పాటను చూసేందుకు భారీగా భక్తులు తరలిరానుండటంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా భక్తులు బాలాపూర్ గణేష్‌ను దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది లడ్డూ రూ.35 లక్షలకు వేలం కాగా.. ఈసారి ఎంత ధర పలుకుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

  • 25 Sep 2026 06:50 AM (IST)

    బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటకు సర్వం సిద్ధం!

    బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటకు సర్వం సిద్ధమైంది. ఈసారి ప్రతిష్ఠాత్మక లడ్డూను ఎవరు దక్కించుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం బాలాపూర్ గణేష్‌కు ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం గ్రామంలో గణనాథుడి శోభాయాత్ర నిర్వహించేందుకు సర్వం సిద్దం చేశారు. అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట జరగనుంది. వేలం పాటను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బాలాపూర్ గణేష్‌ను 15 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు

  • 25 Sep 2026 06:47 AM (IST)

    పోలీసుల నిఘాలో శోభాయాత్ర

    గణపతి శోభాయాత్ర మార్గంలో భక్తుల భారీ రద్దీ దృష్ట్యా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

  • 25 Sep 2026 06:46 AM (IST)

    మహాగణపతి శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి

    హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు బడా గణేష్‌ శోభాయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మహాగణపతి సాగర్ తీరానికి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా క్రేన్ నంబర్-4ను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలలోపు మహాగణపతి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us