Hyderabad: తప్పతాగి ప్రాణాలు తీసావ్ కదరా.. పాపం ఇంజనీరింగ్ విద్యార్థులు..!

Hyderabad Road Accident: హైదరాబాద్ హస్తినాపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని, బైక్‎పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను హోండా సిటీ కార్ ఢీకొట్టింది. బైక్‎ను దాదాపు 100 మీటర్లు ఇడ్చుకెళ్ళి అనంతరం కారు పల్టీలు కొడుతూ రోడ్డుపై బోల్తా పడింది.

Hyderabad: తప్పతాగి ప్రాణాలు తీసావ్ కదరా.. పాపం ఇంజనీరింగ్ విద్యార్థులు..!
Hyderabad Road Accident

Edited By:

Updated on: Apr 08, 2026 | 11:48 AM

హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చిన ఓ హోండా సిటీ కారు ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలిగొనగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. హోండా సిటీ కారు అతివేగంతో అదుపుతప్పి తొలుత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని, ఆపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు వారిని సుమారు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.మరణించిన వారు మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ (ECE) రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శివ, సందీప్ జోహెల్‌గా పోలీసులు గుర్తించారు.

ప్రమాద వార్త తెలియగానే తోటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు.తమ తోటి విద్యార్థుల మృతితో ఆగ్రహించిన కాలేజీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అతివేగంతో కారు నడపడమే ఈ విషాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us