బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. గుండె నొప్పి రావడంతో ఆమెను హూటిహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించగా.. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె కోసం పార్టీ నేతలు ఆసుపత్రికి రాగా.. వారిలో కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక ఆమె పార్థివదేహాన్ని చూసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కంటతడిపెట్టారు. సుష్మాస్వరాజ్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు ఉద్వేగానికి గురయ్యారు. ‘సుష్మాస్వరాజ్ నాకే కాదు యావత్తు తెలంగాణకు చిన్నమ్మే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆమె కృషి ఎప్పటికి మరువలేనిది. ఆమె జీవితాన్ని భారత ప్రజలకు అంకితం ఇచ్చారు. పేద ప్రజల సమస్యలపై ఆమె స్పందించే తీరు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని’ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.