కట కట ఎంత పనైంది.. కట్ల పాము కనిపిస్తే పట్టుకుని పరాచకాలాడాడు.. కట్ చేస్తే, నిమిషాల్లోనే

హైదరాబాద్‌కు చెందిన యువ వ్యాపారవేత్త నవాబ్ సయ్యద్ ఖుమైజ్ మొహిద్దీన్ (30) మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫామ్‌హౌస్ పరిసరాల్లో కనిపించిన చిన్న పామును చేతితో పట్టుకుని స్నేహితులను భయపెట్టేందుకు ప్రయత్నించగా, అదే పాము అతని బొటనవేలిని కాటేసింది. మొదట్లో కాటును నిర్లక్ష్యం చేసిన ఖుమైజ్ ఆరోగ్యం గంటలోపే విషమించడంతో ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కట కట ఎంత పనైంది.. కట్ల పాము కనిపిస్తే పట్టుకుని పరాచకాలాడాడు.. కట్ చేస్తే, నిమిషాల్లోనే
Snake

Edited By:

Updated on: Jun 20, 2026 | 10:55 AM

హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నేహితులను సరదాగా భయపెట్టాలని చేసిన ఓ యువ వ్యాపారవేత్త ప్రయత్నం చివరకు అతని ప్రాణాలనే బలితీసుకుంది. ఫామ్‌హౌస్‌లో కనిపించిన ఓ చిన్న పామును చేతితో పట్టుకుని అందరినీ ఆటపట్టించేందుకు ప్రయత్నించిన యువకుడిని.. అదే పాము కాటేయడంతో మృతి చెందాడు. రాజేంద్రనగర్‌కు చెందిన నవాబ్ సయ్యద్ ఖుమైజ్ మొహిద్దీన్ (30) ఓ వ్యాపారవేత్త. స్నేహితులతో కలిసి మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఖుమైజ్ అక్కడ సరదాగా గడుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫామ్‌హౌస్ పరిసరాల్లో ఓ చిన్న కట్లపాము కనిపించడంతో దాన్ని చేతులతో పట్టుకున్నాడు. పామును చేతిలో పట్టుకుని స్నేహితులను భయపెట్టాలని ప్రయత్నించాడు. అయితే, ఈ క్రమంలో పాము అతని బొటనవేలిని కాటేసింది. మొదట్లో పాము చిన్నదే కావడంతో పెద్దగా ప్రమాదం ఉండదని భావించిన ఖుమైజ్, కాటు విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, చికిత్స అవసరం లేదని స్నేహితులకు చెప్పుకొచ్చాడు. కానీ గంట వ్యవధిలోనే విషం ప్రభావం చూపడం ప్రారంభమైంది. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందారు.

వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఖుమైజ్ మృతి చెందాడు. యువ వ్యాపారవేత్త ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలు చివరకు విషాదంగా మారడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పాము కాటును నిర్లక్ష్యం చేయొద్దు. ఈ ఘటన మరోసారి పాము కాటు విషయంలో అప్రమత్తత ఎంత అవసరమో గుర్తు చేసింది.

వీడియో చూడండి..

పాము చిన్నదైనా, పెద్దదైనా, విషపూరితమా కాదా అన్నది తెలియకపోయినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. పామును పట్టుకోవడం, దానితో ఆటలు ఆడటం వంటి చర్యలు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇళ్ల పరిసరాలు, వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్‌హౌస్‌లు, ఖాళీ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పాము కాటేస్తే ఎలాంటి మూఢనమ్మకాలను ఆశ్రయించకుండా వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us