Hydearabad: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడిని నమ్మి రూ.10లక్షలు కోల్పోయిన యువతి

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలపై పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా కొందరు అప్రమత్తం కావడం లేదు. చివరకు మోసపోయామని తెలుసుకుని మళ్లీ అదే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా బాగా చదువుకున్న వారు సైతం ఇలాంటి మోసాల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మిన ఓ యువతి ఏకంగా రూ.10 లక్షలు కోల్పోయింది.

Hydearabad: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడిని నమ్మి రూ.10లక్షలు కోల్పోయిన యువతి
Online Scam Ai Image

Updated on: Nov 06, 2026 | 4:58 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై, మాయ మాటలు చెప్పి ఓ యువతి నుంచి ఓ కేటుగాడు ఏకంగా రూ.10 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. తనది నెల్లూరు అని, జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఉందని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఇలా పలు విషయాలు చెబుతూ ఆమె నమ్మకాన్ని సంపాదించుకున్నాడు.

యువతి తనను పూర్తిగా నమ్మిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ కేటుగాడు అసలు పథకాన్ని అమలు చేశాడు. తన చెల్లెలి పెళ్లి ఉందని, ఆదాయపు పన్ను శాఖ అధికారులు తన బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారని చెప్పాడు. నగలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని, తన నగలు ఇస్తే పెళ్లి పూర్తయిన వెంటనే తిరిగి ఇచ్చేస్తానని యువతిని నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన యువతి ర్యాపిడో ద్వారా తన నగలను అతడికి పంపించింది.

అయినా ఆ యువకుడి ఆశ తీరలేదు. మరోసారి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని, క్రెడిట్ కార్డు అవసరమని చెప్పాడు. దీంతో అతడిని నమ్మిన యువతి మరోసారి ర్యాపిడో ద్వారా తన క్రెడిట్ కార్డును కూడా పంపించింది. ఇలా విడతలవారీగా యువతి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన నగలు, ఇతర వస్తువులను కాజేశాడు.

కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడి నుంచి ఫోన్ కాల్స్ రావడం ఆగిపోయింది. అంతేకాకుండా అతడు చెప్పిన చిరునామా కూడా నకిలీదని యువతికి తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us