
సమాజ రక్షణలో తాము ఎప్పుడూ ముందుంటామని పోలీసులు మరోసారి నిరూపించారు. ప్రమాద సమయంలో క్షణం కూడా ఆలస్యం చేయకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక విద్యుత్ కార్మికుడి ప్రాణాన్ని కాపాడారు టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్.
హైదరాబాద్ మహానగరం కార్వాన్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో రాజు నాయక్ (44) అనే కాంట్రాక్ట్ కార్మికుడు అసిస్టెంట్ లైన్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కార్వాన్ ప్రాంతంలోని కుమ్మరవాడి హనుమాన్ దేవాలయం సమీపంలో ఒక విద్యుత్ స్తంభంపై మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రమాదవశాత్తు లైవ్ హై-టెన్షన్ వైర్‌ను తాకారు. దీంతో తీవ్రమైన విద్యుత్ ఘాతానికి గురై, స్తంభం పైనుండి కింద పడిపోయారు. ఈ ప్రమాద తీవ్రతకు ఆయన శ్వాస ఆగిపోయి, గుండె కొట్టుకోవడం నెమ్మదించి అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు.
ఆ సమయంలో సమీపంలోనే ‘బ్లూ కోల్ట్స్-I’ గస్తీ విధుల్లో ఉన్న టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బి. సురేష్ ఈ విషయాన్ని గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి ముక్కు వద్ద శ్వాస ఆడటం లేదని గ్రహించిన కానిస్టేబుల్ సురేష్.. ఏమాత్రం తడబడకుండా తక్షణమే కార్డియో-పల్మనరీ రిససిటేషన్ (CPR) ప్రక్రియను ప్రారంభించారు. బాధితుడి ఛాతిపై ఒత్తిడి తెస్తూ ప్రాథమిక చికిత్స అందించారు. “ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో పోలీస్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి సీపీఆర్ అందించడం వల్లే రాజు నాయక్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేది.” అని వైద్యులు తెలిపారు.
కానిస్టేబుల్ సురేష్ శ్రమ వృధా కాలేదు. ఆయన నిరంతరాయంగా సీపీఆర్ చేయడంతో కొద్దిసేపటికే రాజు నాయక్ గుండె స్పందన పునరుద్ధరించాడు. ఆయన నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా ప్రాథమిక అత్యవసర చికిత్స విజయవంతం కావడంతో, కానిస్టేబుల్ సురేష్ స్థానికుల సహాయంతో బాధితుడిని తదుపరి మెరుగైన వైద్యం కొరకు అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సదరు విద్యుత్ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధృవీకరించారు.
ఆపద కాలంలో అసాధారణ సమయస్ఫూర్తిని, ధైర్యసాహసాలను ప్రదర్శించి ఒక మానవ ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ బి. సురేష్‌ను పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. సమయానికి స్పందించి ప్రాణం నిలిపిన కానిస్టేబుల్‌పై స్థానికులు, బాధితుడి కుటుంబ సభ్యులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..